ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు పై ఫోకస్ చేసింది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించనుంది. రేషన్ కార్డుల రంగులతో పాటుగా జారీ మార్గదర్శకాల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
కసరత్తు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటంతో కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు చేస్తోంది. గత ప్రబుత్వం జారీ చేసిన కార్డుల పైన అప్పటి సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలను ముద్రించింది. ఇప్పుడు పాత రేషన్‌కార్డుల స్థానంలో కొత్త కార్డులివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నా.. వీటిలో 90 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తోంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.
కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు
వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్‌కార్డులు ఉండగా.. గడచిన ఐదేళ్లలో 1.48 కోట్లకు పెరిగాయి. అంటే గత ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం 1.10 లక్షలే. కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు 78 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టేసింది. ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ వరఖాస్తు లతోపాటు కొత్తగా పెళ్లయిన దంపతులకు, అన్ని అర్హతలూ ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తోంది.
వారి రేషన్ కార్డులు తొలగింపు
ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు. ఆ కార్డులన్నింటినీ తొలగిస్తే.. వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయవచ్చు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. మళ్లీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చినా దాదాపు సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.