నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..

భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీయే ప్రభుత్వం ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని శుక్రవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా..

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. ప్రజల ఆస్తుల రక్షణపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించింది. వైకాపా పాలనలో భూ కబ్జాలు, రికార్డుల్లో మార్పులు, రీ-సర్వే పేరుతో అనేక సమస్యలు చుట్టుముట్టాయి..ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కరవైంది.ఎన్డీయే ప్రభుత్వం గత జూన్ నుంచి స్వీకరించిన ఫిర్యాదులు/వినతులు 1,74,720 ఉండగా.అందులో 67,928 రెవెన్యూ శాఖకు చెందినవే
ఉన్నాయి. గత ప్రభుత్వంలో 6,888 గ్రామాల్లో అస్తవ్యస్తంగా చేసిన రీ-సర్వేపై మూడు లక్షల వరకు అభ్యంతరాలు/ఫిర్యాదులు గ్రామ సభల ద్వారా వచ్చాయి. ఈ నేపథ్యంలో సమస్యల శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొంటున్నారు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు/వినతులపై..అధికారులు అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి, తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా..

సదస్సులకు సంబంధిత మండల తహసీల్దారు,సర్వేయరు, ఆర్ఎస్ఐ, వీఆర్వో, మండల, గ్రామ సర్వేయర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి హాజరుకానున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అటవీ, దేవాదాయ శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా భూముల వ్యవహారాలకు సంబంధించి దేనిపైనైనా ఫిర్యాదులు / వినతులు అందజేయొచ్చు. పిటిషన్లను ఆర్టీజీఎస్గ్రీవెన్స్ పోర్టల్లో నమోదు చేస్తారు. 1బీ రిజిస్టర్,22(ఏ) జాబితాలను కూడా సదస్సుల్లో అందుబాటులో ఉంచుతారు. ఎసైన్డ్, ఇంటి స్థలాలు,రంగాల వారీగా ప్రభుత్వం కేటాయించిన భూముల జాబితాలను ప్రదర్శిస్తారు. 2019కిముందు భూముల రికార్డులు ఎలా ఉన్నాయి?ప్రస్తుతం ఎలా ఉన్నాయో కూడా పరిశీలన చేస్తారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నంబర్లలో మార్పులు, వారసత్వ పేర్ల నమోదు, ఎసైన్డ్,చుక్కల భూముల పరాధీనం తదితర వాటిపై కూడా వినతులు/ఫిర్యాదులు స్వీకరిస్తారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో.. ఫిర్యాదుల స్వీకరణ సభలను సుమారు రెండు నెలలపాటు నిర్వహించారు. ఆయా చోట్ల ఇంకా ఏవైనా సమస్యలుంటే చెప్పుకోవడానికి మళ్లీ ఇప్పుడు అవకాశం కల్పించారు. ఫిర్యాదులు/వినతులు స్వీకరించిన 45రోజుల్లో వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి తెలుగులోనే సమాధానం ఇస్తారు.

పర్యవేక్షణ అధికారులు

.ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్డీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులను జిల్లాల్లో రెవెన్యూ సదస్సుల పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

ఎన్టీఆర్ జిల్లా-జయలక్ష్మి (సీసీఏల),

ఏలూరు శశిభూషణ్,

అనంతపురం-కాంతిలాల్ దండే,

పార్వతీపురం-కోన శశిధర్,

పశ్చిమగోదావరి–ఎ.బాబు,

శ్రీసత్యసాయి-యువరాజ్,

చిత్తూరు-ఎం. ఎం. నాయక్, కర్నూలు- హర్షవర్ధన్,

నంద్యాల పోలా భాస్కర్,

శ్రీకాకుళం-ప్రవీణ్ కుమార్,

బాపట్ల-శేషగిరిబాబు,

అల్లూరి సీతారామరాజు-కన్నబాబు,

తిరుపతి-సత్యనారాయణ,

విజయనగరం-వినయ్ చంద్,

అన్నమయ్య-సూర్యకుమారి,

పల్నాడు-రేఖారాణి,

కాకినాడ-వీరపాండియన్,

నెల్లూరు-హరికిరణ్,

అనకాపల్లి- శ్రీధర్ చెరుకూరి,

ప్రకాశం-గంధంచంద్రుడు,

వైఎస్సార్-చక్రధరబాబు,

తూర్పు గోదావరి-హరినారాయణ,

కోనసీమ-ప్రభాకరరెడ్డి

కృష్ణా-విజయరామరాజు,

గుంటూరు-మల్లికార్జున

ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఉత్తర్వులిచ్చారు. వీరు తమ శాఖాపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి వస్తుంటారు.

Click here to Share

You cannot copy content of this page