పంట వేయకపోయినా ధ్రువపత్రంతో బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం రైతులకు కల్పించింది. బీమా చేశాక పంట సాగు చేసి ఆ వివరాలను ఈ- పంటలో తప్పనిసరిగా నమోదు చేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు పంట వేసిన తర్వాతనే నమోదు చేయించుకునేవారు.
దీంతో బీమా గడువు లోపల నాట్లు పూర్తి చేయలేని అన్నదాతలు బీమాకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేలా పంట వేయకపోయినా వ్యవసాయ సహాయకుడి ధ్రువపత్రంతో బీమా చేయించుకొని ఆ తర్వాత పంట వేసుకునే అవకాశం ఇచ్చింది.
తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారం పొందే ఆస్కారం ఉంది. ఎకరానికి రూ.84 చెల్లిస్తే బీమాగా రూ.42 వేలు అందుతుంది. ప్రభుత్వం వరి పంటను బీమా చేసేందుకు ఆగస్టు 15 తుది గడువుగా నిర్ణయించింది. అప్పటికి నాట్లు వేయక పోయినా బీమా చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
సాగు అనంతరం ఈ- పంటలో విధిగా నమోదు చేసుకోవాలని వారు తెలుపుతున్నారు. రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుడి వద్ద నుంచి పంట సాగు చేస్తారన్న ధ్రువపత్రం తీసుకుని బీమా చేయవచ్చు.సద్వినియోగం చేసుకోండి పంట వేయక పోయినా బీమా ఎలా చేయాలనే అనుమానం అవసరం లేదు.
గ్రామ వ్యవసాయ సహాయకుడి వద్ద నుంచి పంట సాగు చేస్తారనే ధ్రువపత్రం సమర్పిస్తే సరిపోతుంది.నాట్లు వేసిన తర్వాత ఈ- పంట నమోదు మాత్రం తప్పనిసరిగా చేయాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
దరఖాస్తు విధానం ఇలా!
బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు ప్రీమియం వసూలు చేసి బ్యాంకు సిబ్బంది నేరుగా బీమా చేస్తారు. రుణం తీసుకోని అన్నదాతలు కామన్ సర్వీసు సెంటర్, గ్రామ సచివాలయాల ద్వారా ప్రీమియం చెల్లించి రసీదు పొందవచ్చు. రైతులు, కౌలుదారులు ఆధార్,కౌలు గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతా, గ్రామ వ్యవసాయ సహాయకుడు ఇచ్చిన ధ్రువపత్రాలను నమోదు సమయంలో సమర్పించాల్సి ఉంటోంది.
Leave a Reply