జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది.
భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను అందించడంలో కూడా సహాయపడతాయి.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క మూలం
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందం నుండి ఉద్భవించింది, ఇది ఫిబ్రవరి 2, 1971న ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో ఆమోదించబడిన అంతర్జాతీయ ఒప్పందం. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యం.
రామ్‌సర్ కన్వెన్షన్ ఒప్పందం:
18 దేశాల ప్రతినిధులు ఇరాన్‌లోని రామ్‌సర్‌లో 1971లో నిర్వహించిన సమావేశంలో ఈ ఒప్పందాన్ని స్వీకరించడం జరిగింది, దీని ద్వారా చిత్తడి నేలల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం జరిగింది.
నిబద్ధత:
రామ్సార్ కన్వెన్షన్ అనేది మొట్ట మొదటి ఆధునిక ప్రపంచ పర్యావరణ ఒప్పందంగా మారింది. జీవవైవిధ్యం మరియు మానవ శ్రేయస్సు కోసం చిత్తడి నేలల ప్రాముఖ్యతను తెలియజేస్తూ జరిగిన ఈ ఒప్పందం పై ప్రపంచ దేశాలు కట్టుబడి ఉన్నాయి.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత
జీవవైవిధ్య పరిరక్షణ:
జీవవైవిధ్యానికి చిత్తడి నేలలు కీలకమైనవి, విభిన్న రకాల వృక్ష మరియు జంతు జాతులకు ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ పర్యావరణ వ్యవస్థలను రక్షించాల్సిన అవసరాన్ని ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నొక్కి చెబుతుంది.
నీటి వనరులు:
నీటి వనరులను నియంత్రించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి సహజ ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి, నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి మరియు వరద నియంత్రణలో మరియు నీటి సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.
సాంస్కృతిక ప్రాముఖ్యత:
వివిధ జాతుల ప్రజలు తమ జీవనోపాధి, సాంస్కృతిక పద్ధతులు మరియు సంప్రదాయాల కోసం చిత్తడి నేలలపై ఆధారపడతాయి. వివిధ సమాజాలకు చిత్తడి నేలల తో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని ఈ సమావేశం మరియు ఈ దినం గుర్తు చేస్తుంది.
గ్లోబల్ కోఆపరేషన్:
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది చిత్తడి నేలల సంరక్షణలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి మరియు అవగాహన పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కీలకమైన పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను, సంస్థలను మరియు వ్యక్తులను ప్రోత్సహిస్తుంది.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా, ప్రపంచ దేశాలు చిత్తడి నేలల స్థిరమైన నిర్వహణకు తమ నిబద్ధతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చిత్తడి నేలలు ప్రకృతి మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఆరోగ్యకరమైన భూమి కోసం వీటిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేద్దాం.