రామోజీరావు ఈ పేరు ఒక వ్యక్తి ది కాదు ఒక వ్యవస్థ ది. ఇది ఏదో ఒక్కరు అనే మాట కాదు ఎంతోమంది నమ్మే నిజం. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్, అన్నదాత, రామోజీ ఫిలిం సిటీ ఇలా ఒకటా, రెండా! వివిధ పరిశ్రమలలో తన మార్కును నెలకొల్పిన తెలుగు దిగ్గజం రామోజీరావు.
ఒక ఎడిటర్ గా, పారిశ్రామికవేత్తగా, సంఘసంస్కర్తగా, సినీ నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన రామోజీరావు గారి జీవిత చరిత్ర (biography) మీకోసం..
రామోజీరావు బయోగ్రఫీ – పూర్తి వివరాలు
రామోజీరావు జననం
కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకటసుబ్బమ్మ మరియు చెరుకూరి వెంకటసుబ్బయ్య దంపతులకు రామోజీరావు జన్మించారు.
ఆయన జన్మించినప్పుడు ఆయన పేరు రామయ్య. ఆయన తాత పేరును రామోజీరావు తల్లిదండ్రులు ఆయనకు పెట్టారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయన పాఠశాలలో చేరేటప్పుడు ఆయన ప్రస్తుత పేరు రామోజీరావు ను స్వతహాగా ఆయనే పెట్టుకున్నారు.
అదే పేరు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది.
రామోజీరావు కుటుంబం
ఆయన 1961 లో రమాదేవిని వివాహమాడారు. వారికి ఇద్దరు సంతానం. మొదటి కొడుకు కిరణ్ మరియు రెండవ అబ్బాయి సుమన్.
రామోజీరావు చదువు
ఆయన తన విద్యాభ్యాసాన్ని గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
గుడివాడ కాలేజీలోనే ఆయన బీఎస్సీ డిగ్రీ కూడా పొందటం జరిగింది.
రామోజీరావు కెరీర్ మరియు ఏదుగుదల
బీఎస్సీ పట్టా పొందినటువంటి రామోజీరావు. ఆ తర్వాత భిలై సంస్థ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఎంతకీ ఆయన కు ఆ సంస్థ నుంచి పిలుపు రాకపోవడంతో అక్కడే ఆయన ఆలోచన వ్యాపారం వైపు మళ్ళింది.
ఏ రోజుకైనా తానే ఒకరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని భావించారు.
ఆ తర్వాత ఆయన ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు.
మార్గదర్శి మరియు ఈనాడు ప్రస్థానం
ఆ తర్వాత ఆయన 1962లో మార్గదర్శి అనే చిట్ ఫండ్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ అంచలంచెలుగా ఎదిగి భార్య విజయాన్ని అందించడం జరిగింది.
ఆ తర్వాత తొలుత ఆయన మీడియా రంగంలోకి అన్నదాత అనే మాస పత్రిక ద్వారా ప్రవేశించారు.
ఆ తర్వాత పత్రికా రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేషన్ లో కొరతను గమనించిన ఆయన తొలిసారిగా 1974 లో విశాఖపట్నం వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఒక సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ తక్కువ రేట్ కి కొనుక్కొని ఆయన ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత రెండేళ్లలోనే సర్కులేషన్ 50 వేలకు చేరడం గమనార్హం. తర్వాత ఆయన తిరిగి చూసుకోలేదు. రెండవ ప్రింటింగ్ ను హైదరాబాద్ నుంచి ఆ తర్వాత మూడవ ప్రింటింగ్ విజయవాడ నుంచి ఆయన ప్రారంభించారు.
ఆనతి కాలంలోనే ఈనాడు రాష్ట్రంలోనే లీడింగ్ న్యూస్ పేపర్లలో ఒకటిగా చేరింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యధికంగా సర్కులేట్ అవుతున్నటువంటి వార్తాపత్రికగా రికార్డ్ సంపాదించుకుంది.
ఈటీవీ నెట్వర్క్
కేవలం పత్రికతోటే ఆయన ప్రస్థానం ఆగిపోలేదు. 1995లో ఆయన ఈటీవీ ని ప్రారంభించారు. ఈటీవీ నెట్వర్క్ ఆనతి కాలంలోనే 13 భాషల్లో ప్రాచుర్యం పొందింది. అయితే సక్సెస్ సాధించిన తర్వాత ఇతర భాషల్లో ఉన్నటువంటి ఈటీవీ ఛానల్ లను కలర్స్ కి ఈనాడు గ్రూప్ అమ్మటం జరిగింది.
అయినప్పటికీ న్యూస్ కి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈటీవీ భారత్ ద్వారా ఇప్పటికీ ఈటివి నెట్వర్క్ సేవలు అందిస్తుంది.
ఈటీవీ 9 PM న్యూస్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేరని టిఆర్పి రేటింగ్ తో అగ్రస్థానంలో ఉంటుంది.
కేవలం ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, అన్నదాతతో ఆయన ప్రస్థానం ఆగలేదు.
ఉషా కిరణ్ మూవీస్
సినిమా రంగంలో మొత్తం 88 చిత్రాలను ఆయన నిర్మించారు. సొంతంగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఆయన ఈ సినిమాలను నిర్మించారు.
ప్రియా ఫుడ్స్ మరియు పచ్చళ్ళు
మీడియా రంగంలో మరియు పాత్రికేయ రంగంలో ప్రసిద్ధిగాంచిన రామోజీరావు ఆహారం మరియు పచ్చళ్ళ కి సంబంధించిన బిజినెస్ ప్రారంభించడం గమనార్హం.
ఎంత గొప్పకి ఎదిగినా కూడా విలక్షణ బిజినెస్ లో ఉండాలని ఆయన భావించడంలో ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా 1973లో ప్రియా ఫుడ్స్ ను ఆయన ప్రారంభించారు.
రామోజీ ఫిలిం సిటీ ప్రస్థానం
ఇంతటి పాపులారిటీ ఉన్న ఆయన తెలుగు రాష్ట్రంలో ఒక ఫిలిం సిటీ ఆవశ్యకతను గతంలోనే ఊహించడం జరిగింది. ఆయన ఆలోచనకు అనుగుణంగానే పుట్టినది రామోజీ ఫిలిం సిటీ. నేటికీ 90% పెద్ద సినిమాలు అక్కడనే షూటింగ్ జరుపుకుంటాయి. కనీసం ఒక షూట్ అయినా అక్కడ జరుగుతుంది.
రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా ప్రఖ్యాతి గాంచింది. 1996లో హైదరాబాద్ వెలుపల ఈ ఫిలిం సిటీని రామోజీరావు ప్రారంభించారు. ఈ ఫిలిం సిటీ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధిగాంచింది.
ఈ విధంగా మార్గదర్శి, ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానల్ మరియు నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, రామోజీ ఫిలిం సిటీ, ఉషా కిరణ్ మూవీస్, రైతులకు అన్నదాత, బట్టల రంగంలో కళాంజలి, బ్రెస్సా వంటి వాటిలో అగ్రకామి గా ఎదిగి ఈ రోజున పారిశ్రామిక రంగంలో రాణించాలనుకునే యువతకు ఒక కేస్ స్టడీ గా ఆయన మారారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది రామోజీరావు గారి ప్రస్థానం. ఇంతటి గొప్ప పారిశ్రామికవేత్త మరియు ఎంతోమందికి ఉపాధి కల్పించిన రామోజీరావు గారికి కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. రామోజీరావు గారు జూన్ 8 2024 న గుండె సంబంధిత సమస్యతో తుది శ్వాస విడిచారు. ఆయన లిఖించిన చరిత్ర మరియు ఆయన స్థాపించిన వ్యవస్థ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన కష్టపడే ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ అనడంలో ఎలాంటి సంశయం లేదు.