భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం
భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి దంపతులకు జన్మించాడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మూలాలు ఉన్న కుటుంబంలోనే ఆయన జన్మించాడం మరో విశేషం.
భగత్ సింగ్ తన పాఠశాల విద్యను దయానంద్ ఆంగ్లో-వేద ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు, తరువాత లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో అభ్యసించాడు. తన తొలినాళ్లలో, భగత్ సింగ్ మహాత్మా గాంధీ ద్వారా ప్రాచుర్యం పొందిన అహింస ఆదర్శాలను అనుసరించేవాడు. తరువాతి కాలంలో భగత్ సింగ్ మార్క్సిజం ద్వారా ప్రభావితం కాబడ్డాడు. రష్యా విప్లవ నేత వ్లైమిర్ లెనిన్, లియోన్ ట్రోత్స్కీ మరియు మిఖాయిల్ బకునిన్ రచనల నుండి ప్రేరణ పొందాడు.
మార్చి 1926లో, అతను దేశంలో బ్రిటిష్ పాలనను అంతమొందించే లక్ష్యంతో నౌజవాన్ భారత్ సభ అనే సోషలిస్ట్ సంస్థను స్థాపించాడు. ఇది ఆయన పోరాటానికి తొలి అడుగు అని చెప్పవచ్చు. దీంతో తొలిసారిగా అతను 1927లో, అరెస్టు చేయబడ్డాడు. 1926లో జరిగిన లాహోర్ బాంబు దాడి కేసులో ప్రమేయం ఉన్నట్లు అభియోగాలు ఇతనిపై బ్రిటిష్ వారు మోపడం జరిగింది. అయితే 5 వారాల తర్వాత తనని విడుదల చేశారు.
1928లో, అతను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) లో చేరాడు, సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ ద్వారా ఆపివేయబడిన తర్వాత ,గాంధీజీ నిర్ణయం తో విభేదించిన రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఆయన అనుచరులు నుంచి పుట్టుకు వచ్చిందే ఈ HRA. దానిని తరువాత హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (Hindustan Socialist Republican Association)గా భగత్ సింగ్ ప్రోద్బలం తో మార్చడం జరిగింది. అష్ఫాఖుల్లా ఖాన్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులు కూడా ఇందులో భాగమయ్యారు.
1928లో, బ్రిటీష్ సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ నేతృత్వంలో జరిగిన నిరసన కవాతు, పోలీసుల లాఠీచార్జికి దారి తీసింది. ఇందులో లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఆనాడు దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. దీంతో మనస్తాపానికి గురైన భగత్ సింగ్ , తన HSRA సహచరులు అయిన సుఖ్‌దేవ్, రాజ్‌గురు మరియు చంద్రశేఖర్ ఆజాద్‌లతో కలిసి ఈ లాఠీ ఛార్జ్ కు ప్రధాన కారణం అయిన పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను చంపి, లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పథకం రచించారు.
అది డిసెంబరు 17, 1928. భగత్ సింగ్ తన అనుచరులతో కలసి లాహోర్‌లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో తాము అనుకున్న విధంగా తమ ప్రణాళికను అమలు చేసేందుకు వెళ్లారు. ఈ ప్రక్రియ లో వారు చంపాలి అనుకున్న జేమ్స్ స్కాట్‌కు బదులుగా, స్కాట్ సహాయకుడు ASP జాన్ పి సాండర్స్‌ను పొరపాటున చంపడం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన వారు అక్కడినుంచి ఎవరి కంట పడకుండా తప్పించుకున్నారు. అయినా ఈ కేస్ విచారణ కొనసాగింది.
1929 లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పబ్లిక్ సేఫ్టీ బిల్లు మరియు వాణిజ్య వివాద బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. అసెంబ్లీ దీనిని వ్యతిరేకించినా , వైస్రాయ్ తన ప్రత్యేక అధికారాలతో దీనిని అమలు జరపడానికి అసెంబ్లి లొ సమావేశం అయ్యాడు. దీనిపై నిరసన తెలపాలని భావించిన భగత్ సింగ్ ఒక ప్రణాళికను రచించాడు. ఏప్రిల్ 8, 1929 న, భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. వారు బ్రిటిష్ వారిని భయపెట్టాలని మరియు ఎవరినీ చంపకూడదని మాత్రమే ఉద్దేశించారు. ఆ బాంబులు కూడా చంపే విధంగా తయారు చేయలేదు. అయితే ఇందులో కొంతమంది సభ్యులు గాయపడ్డారు. బాంబులు విసిరిన తర్వాత, సింగ్ మరియు దత్ పారిపోలేదు. అక్కడే నిలబడి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు.
భగత్ సింగ్‌ను ఢిల్లీ జైలు నుండి మియాన్‌వాలీకి మార్చారు, అక్కడ అతను మరియు అతని సహ ఖైదీలు భారతీయ మరియు యూరోపియన్ ఖైదీల మధ్య వివక్షను గుర్తించి దానిపై నిరసన చేపట్టారు, వారు రాజకీయ ఖైదీలు, నేరస్థులు కాదు అనే కారణంతో భారతీయులకు కూడా జైళ్లలో మెరుగైన ఆహారం, పుస్తకాలు, వార్తాపత్రిక మొదలైనవాటిని అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ స్వాతంత్ర ఖైదీల తరఫున నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ నిరసన లో సహా ఖైదీ ఒకరు చని పోయారు. 116 రోజుల దీక్ష తర్వాత ఎంతో కష్టం పైన భగత్ సింగ్ దీక్ష ను విరమింప జేశారు. ఈ నిరాహార దీక్ష ఆనాడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. నెహ్రూ, జిన్నా వంటి వారి మద్దతు కూడా లభించింది. భగత్ సింగ్ పోరాట పటిమ పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకో సాగారు.
ఈ పరిణామాల తో విసుగు చెందిన అప్పటి వైస్రాయ్ ఇర్విన్ నేతృత్వం లోని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే సౌండర్స్ అధికారి మృతి కేసు ను తేల్చి భగత్ సింగ్ ను కడతెర్చాలని పన్నాగం పన్నింది. ఈ మేరకు 1931 లో భగత్ సింగ్ మరియు రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరిశిక్ష అమలుపై తీర్పు ఇచ్చింది. ఇందులో గాంధీజీ కల్పించుకొని ఇర్విన్ ద్వారా క్షమా భిక్ష కల్పించాలని పలువురు కోరారు. గాంధీజీ కోరినప్పటికీ ఇర్విన్ ఒప్పుకోక పోవడం గమనార్హం. అయితే నేరుగా బ్రిటన్ లో ఉన్న ప్రైవీ కౌన్సిల్ కి కూడా అపీల్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఆపీల్ కి స్వతహ గా భగత్ సింగ్ సుముఖత వ్యక్తం చేయలేదు అంటే దానిని బట్టే తెలుస్తుంది. ఆయన కి చావు అంటే అసలు భయం లేదు అని. దేశం కోసం ఎంతో దైర్యంగా ప్రాణాల వదిలిన భారత మాత బిడ్డ భగత్ సింగ్.
మార్చి 23, 1931న, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లతో పాటు షహీద్ భగత్ సింగ్‌ను ఉరితీశారు. ఈ ముగ్గురికి నివాళులు అర్పించేందుకు మనం మార్చి 23ని ‘షహీద్ దివస్’ (అమర వీరుల దినోత్సవం) గా జరుపుకుంటాము. వీరి త్యాగాలను స్మరించుకుంటూ జై హింద్..