అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక.
అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది?
మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు మరియు అమానవీయ పని పరిస్థితుల పై విసుగు చెందిన ఒక గార్మెంట్ కంపెనీ మహిళా ఉద్యోగులు మార్చ్ 8, 1857 న న్యూ యార్క్ నగర వీధుల్లో ఆందోళన చేపట్టారు. ఈ పోరాటం కొన్ని రోజులు కొనసాగింది. ఆ తర్వాత మహిళా లేబర్ యూనియన్ ఏర్పాటుకు ఇది దోహదపడింది.
అయితే కాలం గడిచిన తర్వాత, మరోసారి 1908 మార్చ్ 8 వ తేదీన సుమారు 15 వేల మంది మహిళలు తక్కువ పని గంటలు , మెరుగైన వేతనం, సమాన ఓటు హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా పాదయాత్ర చేశారు. Bread and Roses అనే స్లోగన్ తో వారు ఆందోళన చేపట్టారు. దీంతో మరోసారి ప్రభుత్వం దిగి వచ్చింది.
అదే ఏడాది మే నెలలో అప్పటి అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటి జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28 1909 లో అమెరికాలో జరుపుకున్నారు.
1910లో, కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్‌లో, క్లారా జెట్కిన్ అనే జర్మన్ కార్యకర్త, మహిళలకు సమాన హక్కులు మరియు ఓటుహక్కును ప్రోత్సహించడానికి వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రతిపాదించడం జరిగింది. అనూహ్యంగా ఈ ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 19, 1911న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో జరుపుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే ?
తొలి నాళ్లలో జరిగిన మహిళా పోరాటాలను గౌరవిస్తూ 1975 నుంచి ఐక్యరాజ్యసమితి మార్చి 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటిస్తూ తీర్మానించింది.
ఇక అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలకు మరియు లింగ సమానత్వం కోసం మార్చ్ 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఎన్నో మహిళా సాధికార కార్యక్రమాలు మరియు లింగ సమానత్వం పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. పలు దేశాల్లో ఈ రోజున మహిళలకు సెలవుదినంగా ప్రకటిస్తారు. తొలిసారిగా గత ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవును ప్రకటించడం ప్రారంభించింది.