తెలంగాణలో మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆదివాసీల జాతర.
ఈ జాతర పేరు వినని వారు అంటూ తెలంగాణ రాష్ట్రంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర అసలు చరిత్ర ఏంటి? మేడారం జాతర ఎలా పుట్టింది? జంపన్న వాగు కున్న చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ మీకోసం.
సమ్మక్క అద్భుత శక్తులు గురించి మనకు 13వ శతాబ్దపు గిరిజన పురాణం లో మూలాలు కనిపిస్తాయి. ఈ పురాణం ప్రకారం ప్రకారం ఒకానొక రోజు అడవిలో సంచరిస్తున్నటువంటి గిరిజన నాయకులకు పులుల మధ్య ఆడుకుంటున్నటువంటి ఒక నవజాత శిశువు(సమ్మక్క) కంట పడుతుంది. దివ్యమైన కాంతితో ఆ శిశువు ప్రకాశిస్తూ ఉంటుంది.
ఆమెను వారు గిరిజన అధిపతి వద్దకు తీసుకువెళతారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత ఆమె ఆ ప్రాంత గిరిజన రక్షకురాలిగా మారుతుంది.
సమ్మక్క కు కోయ గిరిజన నాయకుడు పగిడిద్ద రాజుతో వివాహం జరుగుతుంది. ఆ సమయంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తూ ఉండేవారు. క్రీ.శ. 1000 మరియు క్రీ.శ. 1323 వరకు కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విషయం మనకు తెలిసిందే.
సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు: సారక్క ఆమెనే సారలమ్మ అని అంటారు, నాగులమ్మ అనే మరో కూతురు మరియు జంపన్న అనే కుమారుడు ఉన్నారు. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు కోయ తెగపై పన్నులు విధించాడు, అయితే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వారు ఈ పన్నును చెల్లించ లేక పోయారు. ఫలితంగా, ప్రతాపరుద్ర రాజు కోయ తెగపై యుద్ధం ప్రకటించడం జరుగుతుంది.
అయితే ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు మరణించడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో సమ్మక్క ఓటమి ను అంగీకరించడం ఇష్టం లేక యుద్ధంలో తన కుమార్తె సారక్క(సారలమ్మ) , అల్లుడు గోవిందరాజు మరియు కొడుకు జంపన్న తో కలిసి పాల్గొంటుంది.
ఈ యుద్ధంలో సారలమ్మ మరణిస్తుంది. ఆ సమయంలో సమ్మక్క యుద్ధాన్ని యుద్ధాన్ని గెలిచే స్థితిలో ఉంటుంది. మరో వైపు కుమారుడు జంపన్న తీవ్రంగా గాయపడి సంపంగి వాగులో పడి పోతాడు. పురాణాల ప్రకారం, జంపన్న రక్తం ద్వారా ఆ ప్రవాహం మొత్తం ఎర్రగా మారిందని, జంపన్న త్యాగానికి గౌరవసూచకంగా ఆ ప్రవాహానికి “జంపన్న వాగు” అని పేరు పెట్టారని అంటారు.
కొడుకు, కూతురు మృత్యువు తో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమ్మక్క చిలకల గుట్ట అనే కొండపైకి వెళ్లి కుంకుమ పొడితో నిండిన కూజాగా మారిపోతుంది.
యుద్ధం అనంతరం సమ్మక్క మరియు సారలమ్మలను గిరిజన తెగ వారు ప్రతిష్టించి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆమె గౌరవార్థం ఉత్సవం నిర్వహిస్తారు. ఇలా సమ్మక్క సారలమ్మ జాతర పుట్టింది.
నేటికీ, కోయ గిరిజన తెగ భక్తులు సమ్మక్క మరియు సారలమ్మలను వారి గిరిజన తెగ ను రిక్షించడానికి అవతరించిన ఆది పరాశక్తి యొక్క స్వరూపులుగా నమ్ముతారు. ఈ త్యాగాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఉత్సవమే మేడారం జాతర. కుంకుమ జాడీని మేడారం వద్దకు తీసుకువచ్చి, ప్రజలు జంపన్న వాగులో కడుగుతారు, తరువాత సమ్మక్క మరియు సారలమ్మలకు బెల్లం నైవేద్యంగా పెడతారు.
ఈ జాతర కు తెలంగాణా నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సారి భారీ ఏర్పాట్లను చేస్తుంటుంది.