YSR Agri Labs Scheme

వైస్సార్ అగ్రి ల్యాబ్స్

నకిలీల బారినపడి ఏటా వేల కోట్ల రూపాయల పెట్టుబడిని కోల్పోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది . అక్రమార్కుల కారణంగా గడిచిన ఏడున్నర దశాబ్దాలుగా అన్నదాతలు పడుతున్న వెతలకు వీటితో చెక్‌ పడనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 37.42 లక్షల హెక్టార్లు, రబీలో 25.84 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటికోసం 1.20 లక్షల లాడ్స్‌ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగుల మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌లోకి వస్తుంటాయి.

వీటి నాణ్యతను పరీక్షించేందుకు స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్మించిన ల్యాబ్‌లు కేవలం 11 మాత్రమే. వాటిలో ఐదు పెస్టిసైడ్స్, మూడేసి చొప్పున ఫెర్టిలైజర్స్, సీడ్స్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలు ఉన్నాయి. ఇవి ఏమూలకూ సరిపోకపోవడంతో ఏవి నాణ్యమైనవో? ఏవి నకిలీలో తెలియక అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు.

పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి
ఈ నేపథ్యంలో.. ఏపీలో ఇక ఏ ఒక్క రైతు నకిలీల బారిన పడకూడదన్న సంకల్పంతో దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని రీతిలో నియోజకవర్గానికొకటి చొప్పున వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించి ప్రతీ బ్యాచ్‌ను పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా వీటిని ఏర్పాటుచేస్తున్నారు. పట్టణ ప్రాంత నియోజకవర్గాలు మినహా మిగిలిన 147 చోట్ల నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటుచేస్తుండగా, వీటికి అదనంగా 11 జిల్లా స్థాయి, ప్రాంతానికి ఒకటి చొప్పున నాలుగు రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. వీటి ద్వారా ఏటా జిల్లా ల్యాబ్‌లో మూడువేల విత్తన శాంపిల్స్‌ను, 2,500 ఎరువులు, పురుగుల మందుల శాంపిళ్లను పరీక్షించనున్నారు. అదే నియోజకవర్గ ల్యాబ్‌లో 500 సీడ్‌ శాంపిల్స్, 300 ఎరువుల శాంపిళ్లను పరీక్షించనున్నారు. ఈ విధంగా 147 లేబొరీటరీల ద్వారా ఏటా 73,500 సీడ్, 44,100 ఎరువులు, 13 జిల్లా ల్యాబ్‌ల ద్వారా 39,000 సీడ్, 32,500 శాంపిళ్ల చొప్పున ఎరువులు, పురుగుల మందులు పరీక్షించనున్నారు.

రూ.10లక్షల చొప్పున అదనంగా..
ఈ ల్యాబ్‌లకు రూ.192.49 కోట్ల నాబార్డు నిధులను కేటాయించారు. వీటి నిర్మాణ బాధ్యతలను ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిధులు సరిపోవని కార్పొరేషన్‌ చెప్పడంతో ఒక్కో ల్యాబ్‌కు రూ.10.90 లక్షలు అదనంగా పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అంచనా విలువ రూ.203.39 కోట్లకు చేరింది. ఈ నిధుల్లో రూ.163.39 కోట్లు భవనాలకు, రూ.40కోట్లు పరికరాలకు వెచ్చిస్తున్నారు. జపాన్, జర్మనీల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చేందుకు కృషిచేస్తున్నారు.

కొనుగోలు సమయంలోనే చెక్‌ చేసుకోవచ్చు
ఫలితాలను ట్యాంపర్‌ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి ల్యాబ్‌ను ఆటోమేషన్‌ చేస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను తీసుకొస్తున్నారు. ఏ ల్యాబ్‌లో ఏ బ్యాచ్‌ శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారో ఈ టెక్నాలజీతో తెలిసిపోతుంది. రైతు షాపుకెళ్లినప్పుడు బ్యాచ్‌ నెంబర్‌ చెక్‌ చేసుకుంటే చాలు దానికి నాణ్యతా సర్టిఫికెట్‌ ఉందో లేదో.. తీసిన శాంపిల్స్‌కు టెస్టింగ్‌ జరిగిందో లేదో కూడా పరిశీలించుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లలో అదనంగా గ్రో అవుట్‌ టెస్టింగ్‌ ఫెసిలిటి కూడా కల్పిస్తున్నారు. కొన్ని రకాల మొక్కలను నాటి వాటి జెనెటిక్‌ ఫ్యూరిటీ టెస్టింగ్‌ చేయబోతున్నారు.


వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ సేవలు ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. మార్చి నెలాఖరు కల్లా 133 పూర్తికానున్నాయి. 14 ల్యాబ్స్‌ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కంపెనీలు, అమ్మకందారుల్లో జవాబుదారీతనం తీసుకురావడంతోపాటు రైతులకు నాణ్యమైన ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page