ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపికబురు అందించనుంది. వారికి 100 శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్‌ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు నివేదించారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

2024-25 ఏడాదికి.. నియోజకవర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఏటా పథకం అమలు

త్రిచక్ర వాహనాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నుంచి భారీగా డిమాండ్‌ ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కసారే పంపిణీ చేశారు. సుమారు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే వైకాపా నేతలు సిఫారసు చేసిన వారికి ప్రాధాన్యమిస్తూ 1,750 మందికి అందించారు. ఎన్నికల ముందు ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ మరోసారి జిమ్మిక్కులు చేశారు. కానీ ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ ఏడాది 1,750 మందికి త్రిచక్ర వాహనాలు అందించడంతోపాటు.. ఏటా ఇదే స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

త్రిచక్ర వాహనాల పంపిణీకి దివ్యాంగుల అర్హతలను ప్రభుత్వం నిర్ధారించింది. డిగ్రీ, ఆపై ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, కనీసం ఏడాదికి పైబడి స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు అర్హులు. 18-45 ఏళ్ల మధ్య ఉన్నవారికి అందిస్తారు. రూ.3 లక్షలలోపు ఆదాయ పరిమితి ఉండాలి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page