Matsyakara bharosa 2025 release date on april 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో మత్స్యకార భరోసా పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం అనంతరం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు గురించి మంత్రి నిమ్మల రామానాయుడు విలేకర్ల సమావేశంలో వివరించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా సాయం అందించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు రూ.20 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని.. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఐటీ శాఖను బలోపేతం చేసే దిశగా.. విశాఖలో టీసీఎస్ విస్తరణకు భూమిని కేటాయించినట్లు తెలిపారు.
మరోవైపు సముద్రతీర ప్రాంతాల్లో నివాసం ఉండే మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం చేపలవేట. అయితే ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ చేపల వేట మీద నిషేధం అమల్లో ఉంటుంది. దీంతో ఈ సమయంలో మత్స్యకారులు ఉపాధి కరువై ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వైసీపీ హయాంలో మత్స్యకార భరోసా పేరిట పథకం తీసుకువచ్చారు. ఈ పథకం కింద చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు సాయంగా అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా సాయం పెంచుతామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. పది వేల నుంచి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందించనున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఏపీలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంది. సాధారణంగా మత్స్యసంపద పునరుత్పత్తి కాలం ఏప్రిల్ 15 నుంచి జూన్ 16. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటపై నిషేధం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ నిషేధం సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద లభ్యతపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఏపీలోని పలు జిల్లాలలోనూ చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్నారు. దీనిపై తీర ప్రాంతాల గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దుచేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Leave a Reply