సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు (Cyber Crime) కూడా ఎక్కువవుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) జరిపే క్రమంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కీలకమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిపోతోంది. సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్నవారు కూడా కొన్నిసార్లు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం. మరోవైపు వివిధ సర్వీసు ప్రొవైడర్లు ప్రకటిస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత వాటిని మూలన పడేస్తున్నారు. దీనివల్ల కూడా సైబర్ నేరగాళ్లకు ఒక అవకాశం ఇచ్చినట్లవుతోంది. అదే నంబర్‌తో కొత్త సిమ్‌కార్డులను యాక్టివేట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడలోని ఓ వ్యక్తి ఆధార్ కార్డుతో ఏకంగా 658 సిమ్‌కార్డులు యాక్టివేట్ అయి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దానిని గుర్తించిన టెలికాం అధికారులు వాటన్నింటినీ బ్లాక్ చేసేశారు.
ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో టెలికాం శాఖ కొత్త నిబంధలను రూపొందించింది. ఒక ఆధార్ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులు తీసుకునేందుకు మాత్రమే అనుమతించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్‌కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ-వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ.. తమ ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఆధార్‌కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్లు అనుసంధానమై ఉన్నాయో చెప్పడమే కాకుండా.. మొబైల్‌ను ఎవరైనా చోరీ చేసినా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునేలా అవకాశం కల్పించారు.
ఒక ఆధార్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?
- తొలుత tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో ‘బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్’, ‘నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- రెండో ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. వినియోగదారుడి 10 అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలని అడుగుతుంది.
- ఆ తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా చూపిస్తుంది.
- అందులో ఏదైనా నంబర్ మీది కాకపోయినా.. ప్రస్తుతం వినియోగించకపోయినా.. దానిని బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు.
Leave a Reply