ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

ఉగాదికి ఉచిత బస్సు.. మహిళలకు తీపి కబురు చెప్పనున్న ప్రభుత్వం

రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే ప్రభుత్వం తీపి కబురును అందించనుంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్ కమిటీ నివేదికను అందించినట్టు సమాచారం. ఫిబ్రవరి నెల 6 తేదీన జరగబోయే క్యాబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం కలదు. అలాగే ఆ సమావేశంలోని ఉచిత బస్సు ప్రయాణం యొక్క విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం కలదు.

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్పేరిట మహిళలకు పలు వరాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాల నిరంతరం అధికారులతో సమీక్షిస్తూ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా పలు పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటుచేస్తూ అమలులో లోటుపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్సిలెండర్ల పథకం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో పథకం అమలుపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలును ఉగాది నుంచే ప్రారంభించాలనే నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. కర్నాటక, తెలంగాణ,ఢిల్లీ, పంజాబ్ వంటి చోట్ల మంత్రులు పర్యటించి పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించారు. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు అవుతున్న విధానం, ఎదురవుతున్న ఇబ్బందులను సైతం మంత్రులు సేకరించారు. ఉచితబస్సు ప్రయాణంతో ఆటో, క్యాబ్ వంటి వారికి జరిగే నష్టాలను సైతం అక్కడి అధికారులు అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ అందుకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలను సైతం అధ్యయనం చేశారు. అన్ని రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేసిన మంత్రులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై నివేదికను అందజేశారు.

గతంలోనే అధికారుల నివేదిక..

వివిధ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుపై గతంలోనే అధికారులు సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల నివేదిక కోరింది.ఆర్టీసీ ఉన్నతాధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును అధ్యయనం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగాను, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగాను పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అక్కడి విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ అమలుకు అయ్యే వ్యయం, బస్సులసంఖ్య, ఉద్యోగుల నియామకం వంటి పలు అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తే సంస్థపై ఏటా రూ.2,500 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో బస్సులఆవశ్యకత, ఉద్యోగుల నియామకంపై కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అధికారులు నివేదిక, కేబినెట్ సబ్ కమిటీ నివేదికలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత అమలుకు విధి విధానాలు రూపొందించి ప్రకటించనున్నట్లు తెలిసింది. ఏదేమైనా ఉగాదికి మహిళలకు తీపి కబురు చెప్పేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page