సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు తక్షణ సాయంగా ₹10వేలు

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు తక్షణ సాయంగా ₹10వేలు

ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. రాజీవ్‌ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం సీఎం రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి తదితరులు ఉన్నారు.

70 ఏళ్లలో ఇంత వర్షం లేదట!

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘చాలా బాధాకరమైన సందర్భం ఇది. వరద మీ బతుకుల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది. మంత్రులు, అధికారులు నిరంతరం మీ కోసం కష్టపడుతున్నారు. మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారు. పెద్దలతో మాట్లాడుతుంటే.. 60, 70 ఏళ్లలో ఇంత భారీ వర్షాన్ని (40సెం.మీల) చూడలేదని చెబుతున్నారు. భారీ వర్షాల వల్ల రాజీవ్‌ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయి. ఆ ఇళ్లలోకి వెళ్లి చూస్తే సర్వం నీళ్లలో మునిగిపోయాయి. కష్టపడి సంపాదించి కొనుక్కున్న పప్పూ ఉప్పూ మొదలుకొని అన్ని వస్తువులూ నీటమునగడంతో తీవ్రంగా నష్టపోయారు. వరద నీటిలో తమ పిల్లల సర్టిఫికెట్లూ నానిపోయాయంటూ కొందరు వాపోతున్నారు. 

భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రతి కుటుంబానికీ బియ్యం, ఉప్పు, పప్పు, మంచినీరు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించాం. ఇళ్లు నీట మునిగిన వారిని తక్షణమే గుర్తించి రూ.10వేలు వెంటనే అందించాలని ఆదేశిస్తున్నాం. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే రూ.5లక్షలు, పశు సంపద నష్టం వాటిల్లితే రూ.50వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించాం. ఇల్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు పీఎం ఆవాస్‌ యోజన కింద నష్టాన్ని అంచనా వేసి దానికి ఆర్థిక సాయం అందిస్తాం. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయినవారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబాలకు అందుబాటులో ఉండి మీ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత మాది. ఎమ్మెల్యేలు, మంత్రులు మీ నష్టాన్ని అంచనా వేస్తారు. ధైర్యంగా ఉండండి. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎంత నష్టపోయారో అంచనా వేస్తారు’’ అని సీఎం తెలిపారు.

You cannot copy content of this page