మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి? ఈ బిల్లు ఎలా పుట్టింది? పూర్తి డీటైల్స్ మీకోసం

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, అదే మహిళా రిజర్వేషన్ బిల్లు పైన. కేంద్ర క్యాబినెట్ అమృతం తెలిపినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ గడపను తాకింది. ప్రస్తుతం విపక్షాలు మరియు అధికారపక్షం అందరి మద్దతు తో భారీ మెజారిటీ తో లోక్ సభ లో నెగ్గిన ఈ బిల్లు సులభంగా రాజ్య సభ లో కూడా నెగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? ఇది చట్ట రూపం దాల్చిన తర్వాత ఏమవుతుంది? దీని చరిత్ర ఏంటి? పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి? [What is Women’s Reservation Bill]

స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇప్పటికీ కూడా మహిళల ప్రాధాన్యత చట్టసభలో అంతంత మాత్రమే ఉంది. పంచాయతీ  రాజ్ వంటి వ్యవస్థలలో మహిళలకు రిజర్వేషన్ తీసుకువచ్చినప్పటికీ లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఇప్పటివరకు మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదు.

మహిళల సుమన హక్కులను పరిరక్షించేందుకు వీలుగా ఈ మహిళా రిజర్వేషన్ ను 1989 నుంచి పలుమార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే స్థానిక ఎన్నికల్లో అనగా పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీల్లో మహిళల రిజర్వేషన్ ను అయితే ఆమోదించారు కానీ చట్టసభల్లో రిజర్వేషన్లు మాత్రం ఇప్పటివరకు ఆమోదించలేకపోయారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 2008 లో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ 108 ద్వారా సూచించబడింది.

108 వ సవరణ ఏం చెప్తుందంటే..

– లోక్ సభ మరియు రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళల కోసం రిజర్వ్ చేయాల్సిందిగా పేర్కొనడం జరిగింది.

– కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలకు కూడా ఇది వర్తిస్తుంది.

–  33% కోటాలో ఎస్సీలు, ఎస్టీలు ఆంగ్ల ఇండియన్స్ వంటి సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది.

– అయితే ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ రద్దు అయిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు మూడింటి ఒక వంతు రిజర్వేషన్ ఆమోదం తెలపడం జరిగింది.

– ప్రతిసారి పత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్ చేయబడినటువంటి సీట్లను రొటేషన్ పద్ధతిలో మార్చడం జరుగుతుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఏంటి [History of Women’s Reservation Bill]

మహిళా రిజర్వేషన్ బిల్లు: చరిత్ర

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా మహిళా రిజర్వేషన్ ను తెర పైకి తీసుకువచ్చారు.  గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు గాను మే 1989లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది.

అయితే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్‌లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది.

1992, 1993లో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు రాజ్యాంగ సవరణ బిల్లులు 72 మరియు 73 లను తిరిగి ప్రవేశపెట్టారు. వీటి ద్వారా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) రిజర్వ్ చేయబడింది. ఈ బిల్లులను ఆనాడు ఉభయ సభలు ఆమోదించడం జరిగింది. తద్వారా ఇవి చట్టరూపం దాల్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీలు, నగరపాలికల్లో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు.

సెప్టెంబర్ 12, 1996, అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్‌ లో మహిళల రిజర్వేషన్ కోసం 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో విఫలమైంది. దీంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు ను సిఫార్సు చేశారు. డిసెంబరు 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే, అప్పుడు లోక్‌సభ రద్దుతో బిల్లు కూడా రద్దు అయింది.

రెండు సంవత్సరాల తర్వాత, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వం 1998లో అనగా 12వ లోక్‌సభలో WRB బిల్లును మరోసారి ప్రవేశపెట్టింది. అయితే, ఈసారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు.ఈ బిల్లు మరోసారి వీగిపోయింది.

వాజ్‌పేయి ప్రభుత్వంలో తిరిగి 1999, 2002 మరియు 2003లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు , కానీ విజయవంతం కాలేదు.

ఐదేళ్ల తర్వాత, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లో మహిళా రిజర్వేషన్ బిల్లు కొంత పురోగతి సాధించింది. 2004లో ప్రభుత్వం దీనిని కామన్ మినిమం ప్రోగ్రాం లో భాగంగా చేర్చడం జరిగింది. 1996లో ముఖర్జీ కమిటీ సూచించిన ఏడు సిపారసుల్లో ఐదింటిని ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈసారి నేరుగా రాజ్యసభలో నే దీనిని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బిల్లును మరోసారి మే 9 2008న స్టాండింగ్ కమిటీకి రాజ్యసభ పంపించింది. స్టాండింగ్ కమిటీ తన నివేదికను 2009 డిసెంబర్ 17న సమర్పించింది. ఫిబ్రవరి 2010 కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలుపగా రాజ్యసభలో మార్చ్ 9 2010 న ఈ బిల్లా ఆమోదం పొందింది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన అటువంటి బిల్లులు లోక్సభ మాదిరిగా ఆరు నెలల్లో వీగిపోవు. అయితే ఆ తర్వాత లోక్సభ కి ఈ బిల్లు చర్చకే రాలేదు. చివరగా 2014లో లోక్సభ ముగియటం తో ఈ బిల్లు కూడా వీగిపోయింది.

సుమారు దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుతం ఈ బిల్లు తిరిగి పార్లమెంట్లో కి రావడం అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరమైన విషయమే. ఇప్పటికే లోక్ సభ లో పాస్ అయిన ఈ బిల్లు రాజ్య సభ లో కూడా సులభంగా నెగ్గి చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.

ఈ బిల్లు ఈసారి పాస్ అయినప్పటికీ కూడా డీలిమిటేషన్ తర్వాతనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటే 2027 వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!