దేశ జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు మన దేశంలో నిజంగానే సమచితమైన స్థానం ఉందా అంటే ఇప్పటికీ లేదని చెప్పాలి.
మహిళలు పురుషులతో సమానం, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాము అని గొప్పలు చెప్పుకునే మన రాజకీయ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం చట్టసభల గడప దాంటించ లేక పోతున్నారు.
అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి?
భారతదేశ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ని కల్పించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లే మహిళా రిజర్వేషన్ బిల్.. ఈ బిల్ ద్వారా లోక్ సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ బిల్లు ఆమోదిస్తే రొటేషన్ పద్ధతిలో ఈ 33% మహిళా రిజర్వేషన్ ను నియోజకవర్గాల వారీగా ప్రతి రాష్ట్రంలో అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆవశ్యకత ఏంటి?
1993లో పంచాయతీలలో మహిళా రిజర్వేషన్లు తెచ్చినప్పటి నుంచి ప్రారంభమైన ఈ డిమాండ్ , దశాబ్దాల గడుస్తున్నా చట్టసభలు దాటలేదు.
మహిళా సాధికారత, మహిళల సమానత్వం మరియు రాజకీయంగా కూడా మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి ఈ చట్టం ఎంతైనా అవసరం.
మహిళా హక్కులను మరింతగా ముందుకు తీసుకు వెళ్ళటానికి, మహిళా చట్టాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి, మహిళా స్వశక్తిని పెంచి సమాజంలో మహిళలకు పురుషులతో సమానమైన స్థానాన్ని కల్పించడానికి ఈ బిల్లు కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితేనే ఇదంతా సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఈ బిల్లు ఎప్పుడు ప్రారంభమైంది ? ప్రస్తుతం స్టేటస్ ఏంటి?
ఎన్నో ఆర్భాటాల మధ్య మే 2008లో చట్టసభల్లోకి అడుగుపెట్టిన ఈ బిల్ తర్వాత స్టాండింగ్ కమిటీ సిఫారసులకు గాను పంపించడం జరిగింది. ఆ తర్వాత 2010 లో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించగా,ఆ తర్వాత దీనిని లోక్ సభకు పంపించడం జరిగింది. అయితే దీనిని లోక్ సభ ఆమోదించలేదు. తద్వారా 15వ లోక్ సభ లోనే ఇది వీగిపోయింది.
పలుమార్లు ఈ బిల్లుపై చట్టసభల్లో డిమాండ్లు వినిపించినప్పటికీ ఈ రిజర్వేషన్ పై ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పాలి.
చట్టసభల్లో అధికార పార్టీలకు మెజారిటీ ఉన్నా ఎందుకు ఇంతవరకు ఆమోదించలేదు?
గత యూపీఏ ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కానీ చట్టసభల్లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఈ బిల్లును ఆమోదించలేకపోయాయి. ఇందుకు రాజకీయ పార్టీలు తమదైన కారణాలు చెబుతూ వస్తున్నాయి.
అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కుదిరితే ఈ బిల్లును ఆమోదిస్తామని చెప్పటం ద్వారా ఏ ప్రధాన పార్టీలకు చిత్తశుద్ధి లేదని తెలుస్తుంది.
ఎన్నో బిల్లులను ఏకాభిప్రాయం లేకపోయినా అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీతో పాస్ చేయగలిగినప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారో సామాన్య ప్రజలకు అర్థం కాని ప్రశ్న.
దీనికి రాజకీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ అమలు చేసినట్లయితే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి పురుష ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టు కోల్పోయే అవకాశం ఉంది. రొటేషన్ ఉండటం వలన వారికి సీట్ రాకపోవచ్చు అనే భావన తో పార్టీ కోసం చురుగ్గా పని చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
భారతదేశ రాజకీయంగా మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉంది?
ప్రపంచంలో వివిధ దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ అని చెప్పాలి. చాలావరకు దేశాల చట్ట సభలలో 20 నుంచి 25% మహిళల శాతం ఉంటుంది. కానీ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారత దేశంలో మాత్రం కేవలం 12 శాతం ఉండటం గమనార్హం. సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా మహిళ ప్రాతినిథ్యం మెరుగ్గా ఉంది.
అంతేకాకుండా, కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గం లో కూడా వీరి ప్రాతినిధ్యం పురుషులతో పోలిస్తే చాలా తక్కువ.
ప్రతి ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫారం ద్వారా విడుదల చేయబడుతున్న Global Gender Gap Report 2022 జాబితాలో మొత్తం 146 దేశాలకు గాను భారతదేశ ర్యాంక్ 135 స్థానంలో ఉండటం లింగ అసమానత కు నిదర్శనం అనే చెప్పాలి.
ఇప్పటికైనా ఆమోదించే అవకాశం ఉందా?
ఇప్పటి వరకు ఏవేవో కారణాలు చెబుతూ కాలం దాటేస్తున్న అధికార పార్టీలు ఇప్పటికైనా చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని యావత్ దేశం కోరుకుంటుంది. ప్రతి పార్టీలో ఉన్నటువంటి మహిళా పొలిటికల్ వింగ్స్ ఈ మేరకు తమ కార్యచరణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో చిత్త శుద్ధి తో ఏకాభిప్రాయానికి వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలు దాటించాలని కోరుకుందాం.