పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు.
అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు.
దీనినే కాటన్ క్యాండీ అని కూడా అంటారు. అయితే ఈ కాటన్ క్యాండీ లేదా పీచు మిఠాయి పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి విక్రయాలను నిషేదిఅతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
పీచు మిఠాయి (Cotton Candy) నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగ అధికారులు రాజధాని చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇందులో పలు నమూనాలను అధ్యయనం చేయగా, కాటన్ క్యాండీల్లో రోడమైన్-బి అనే కెమికల్ను వాడినట్లు నిర్దారించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.
సాధారణంగా ఈ రోడమైన్-బిని ‘ఇండస్ట్రియల్ డై’గా పిలుస్తారు. బట్టల రంగులకు, పేపర్ ప్రింటింగ్లో వాటి రంగులకు దీనిని వినియోగిస్తారు. ఫుడ్ కలరింగ్ కోసం దీనిని ఉపయోగించ కూడదు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
దీంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈమేరకు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి తయారీ, విక్రయాలు అన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేసినట్లు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.