Barren Island – ఈ పేరు లోనే ఇది ఒక బంజరు ద్వీపం అనే అర్థం మనకి తెలుస్తుంది.
అండమాన్ నికోబార్ లో భాగమైన ఈ బ్యారెన్ ద్వీపం అనేది దేశంలోనే ఆక్టివ్ ఉన్న ఒకే ఒక అగ్ని పర్వతం. ఇది భారత దేశం లోనే కాదు దక్షిణాసియాలోనే నిర్ధారించబడిన ఏకైక చురుకైన అగ్నిపర్వతం.
ఈ ద్వీపానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ద్వీపం అండమాన్ మరియు నికోబార్ రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్ కు 138 కిలో మీటర్ల దూరంలో ఈశాన్య దిక్కున బంగళా ఖాతం లో ఉంటుంది.
బ్యారెన్ అంటే ఇంగ్లీష్ లో బంజరు భూమి అని అర్థం. అంటే జనావాసం లేని ప్రదేశం. పేరు కు తగ్గట్లే ఈ ద్వీపం లో ఎవరూ నివసించరు. ఈ అగ్నిపర్వతం తరచుగా బద్దలై లావా ను వెదజల్లుతూ ఉంటుంది.
ఈ ద్వీపం కేవలం 2 కిలోమీటర్ల వ్యాసం లో ఉంటుంది. మొత్తం 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దక్షిణాసియా బెల్ట్‌లోని అతి చిన్న ద్వీపాలలో ఇది ఒకటి.
ఈ ప్రదేశం గురించిన విచిత్రమైన విషయం ఏమిటంటే, అకస్మాత్తుగా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ, ఇది తరచుగా సందర్శించే టూరిస్ట్ స్పాట్. లావా వెదజల్లని సమయాలలో ఈ ద్వీపానికి జనాల తాకిడి ఉంటుంది. ఇది స్కూబా డైవింగ్ వంటి అనేక కార్యకలాపాలకు అండమాన్ ప్రాంతంలోనే ఉత్తమ ప్రదేశాలలో ఒకటి గా ఉంది.
అంతే కాదు ఈ ద్వీపం చుట్టూ అరుదైన జాతుల మాంటా కిరణాలు, పెరుగుతున్న పగడపు అడవులు మనకు దర్శనం ఇస్తాయి. ఆసక్తికరమైన ఆకారాలు, అంతకుముందు అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో లావా ప్రవహించిన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణలు గా నిలుస్తాయి.