రక్షా బంధన్ దీనినే మనం రాఖీ పూర్ణిమ అని కూడా అంటాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు జరుపుకునే ఈ పవిత్రమైన పండుగ గురించి మీకు తెలుసా? ఈ పండుగ అసలు ఎలా పుట్టింది? ఈ పండుగ కి సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర మరియు ఫ్యాక్ట్స్ మీ కోసం.
రక్షాబంధన్ పండుగ పుట్టిందో తెలుసా?
మహాభారతం లో శ్రీకృష్ణుడు ద్రౌపతి
పురాణాల్లో రక్షాబంధన్ కి సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒకానొక సందర్భంలో గాయపడి చేతి నుంచి రక్తం కారుతున్న సమయంలో, అది చూసిన ద్రౌపతి, వెంటనే తన చీర కొంగు చింపి అన్న గాయని కి కడుతుంది. దీంతో పులకించి పోయిన శ్రీకృష్ణుడు నీకు ఎల్లప్పుడూ నేను అన్నివేళలా తోడుగా ఉంటానని అభయమిస్తాడు. కౌరవ సభలో ద్రౌపతి వస్త్రాభరణ సమయంలో శ్రీకృష్ణుడు తన చెల్లి ద్రౌపతి మర్యాద ను కాపాడుతాడు.
విష్ణు పురాణంలో మహాబలి చక్రవర్తి మహాలక్ష్మి
మరొక కథ ఏంటంటే, విష్ణు పురాణం ప్రకారం మహాబలి చక్రవర్తి గొప్ప దానశీలుడు. తనకి దానగుణంతో అన్ని లోకాలు జయించి దేవతలను పాతాళానికి పంపిస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు మహావిష్ణువుని శరణు కోరగా, శ్రీమహావిష్ణువు సాక్షాత్తు వామనవతారంలో మహాబలి చక్రవర్తి ఇంటికి వచ్చి మూడు అడుగుల భూమిని అడుగుతాడు. తన విశ్వరూపం ధరించి మొదటి అడుగు భూమి మీద రెండవ అడుగు ఆకాశంలో పెట్టగా, మూడో అడుగు ఎక్కడ పెట్టాలో అడుగుగా దానశీలుడైన మహాబలి చక్రవర్తి తన శిరస్సును మూడో అడుగు కోసం ఇస్తాడు. ఈ విధంగా స్వర్గం కంటే గొప్పదైన పాతాళాన్ని మహాబలి చక్రవర్తి పొందుతారు. అలా మహావిష్ణు అవతారమైన వామనుడు మహాబలి చక్రవర్తి ఇంట్లో ఉండిపోతాడు. ఈ నేపథ్యంలో వైకుంఠం నుంచి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మహాబలి చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. దీనికి పరవసుడైనటువంటి మహాబలి చక్రవర్తి ఏం కావాలో కోరుకోమని శ్రీ మహాలక్ష్మిని అడుగుతారు. తనకు ఏమీ వద్దని తన భర్తను వైకుంఠం పంపించాలని కోరుకుంటుంది. ఆ విధంగా వామన అవతారం ఛాలించి శ్రీ మహా విష్ణువు వైకుంఠానికి చేరుతారు.
రాణి కర్ణవతి కథ
అయితే ఆధునిక యుగంలో దీనికి ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది మొగల్ చక్రవర్తి హుమయున్ కాలంలో అని చాలామంది నమ్ముతారు.
16వ శతాబ్దంలో రాణి కర్ణవతి మేవార్ రాజ్యానికి చెందిన రాణి. ఆమె తన భర్త విక్రమాదిత్య సింగ్ మరణం తర్వాత మేవార్ సింహాసనాన్ని స్వీకరించి, తన చిన్న రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించింది. ఆ సమయంలో గుజరాత్ సుల్తాన్ బహదూర్శ ఆమెపై దాడి చేస్తాడు.
దాడి నుంచి తనను కాపాడాలని రాణి కర్ణావతి మొగల్ చక్రవర్తి హుమాయూన్ ను కోరుతుంది. ఇందుకోసం ఆమె ఒక దారాన్ని ఆయనకు పంపిస్తుంది. అయితే ఆ దారానికి సంబంధించిన సారాంశం ఆయనకు తొలుత అర్థం కాదు. తర్వాత ఆయనకు ఈ దారం యొక్క సారాంశాన్ని అక్కడివారు వివరిస్తారు. ఒక సోదరి తన సోదరుడి సహాయం కోసం అర్థిస్తూ పంపించే దారమని, ఇది సంప్రదాయమని తెలిపారు.
వెంటనే స్పందించిన హుమాయూన్, ఆమెను కాపాడేందుకు మేవార్ బయలుదేరుతాడు. అయితే ఆ రోజులలో గుర్రాల్లో స్వారీ చేస్తూ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గం మధ్యలో ఆయన వేరే యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది. ఆయన చేరుకునే సమయానికి రాజ్యాన్ని కోల్పోయి తన ఆత్మీయులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆమెను కాపాడ లేకపోయినా, 16వ శతాబ్దం నుంచి ఈ పండుగ మరింత ప్రాచుర్యం పొందింది అని చెప్పవచ్చు.
ఈ విధంగా రక్షాబంధన్ లేదా రాఖీపూర్ణిమ ఒక అన్న లేదా తమ్ముడి యొక్క రక్ష ను కాంక్షిస్తూ తోబుట్టువు ప్రేమతో కట్టే బంధనం. అదే సమయంలో తన చెల్లిని లేదా అక్కను జీవితాంతం రక్షిస్తానని అన్న అభయం ఇవ్వడమే ఈ పవిత్ర మైన పండుగ సారాంశం.