జుట్టు మన శరీరంలో ఒక కీలకమైన భాగం. ఒత్తైన కురులు అందానికి ప్రతీక. జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అటు స్త్రీలకైనా పురుషులకైనా జుట్టు ఒత్తుగా పెరగాలంటే కింది ఆహారాలను మీ ప్రతిరోజు మెనూ లో చేర్చండి.
1. క్యారెట్ మరియు చిలగడదుంప : ముందుగా దుంపలలో జుట్టుకి మేలు గుణాలు అధికంగా ఉండేది క్యారెట్ మరియు చిలకడదుంపలలో. విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ దృఢమైన కేశాలకు కచ్చితంగా అవసరం. క్యారెట్ మరియు చిలకడదుంప లేదా గనసి గడ్డలలో ఇది పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టును దృఢంగా ఉంచడంలో ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో దోహదపడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
2. పాలకూర మరియు కరివేపాకు : ఆకుకూరలు విషయానికి వస్తే పాలకూర జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. ఇక మనం ప్రతిరోజు కూరల్లో వాడుకునే కరివేపాకు కూడా జుట్టుకి మంచిది. కరివేపాకు కదా అని తీసి పడేయకుండా దానిని తింటే మనకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
పాలకూరలో ఉండే జింక్ రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇక కరివేపాకు లో ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించి డెడ్ ఫోలికల్స్ ను తొలగించడంలో దోహదపడతాయి.
ఈ రెండే కాకుండా ఆకుకూరల్లో మునగాకు కూడా జుట్టు పోషణకు ఉపయోగపడుతుంది.
3.బాదం: ఇక గింజల విషయానికొస్తే బాదం పప్పు రోజు రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జుట్టు ఎదుగుదలకు ఎంతో మంచిది. బాదంపప్పులో విటమిన్ ఈ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ మినరల్స్ జుట్టు ఎదుగుదలకు ఎంతో అవసరం. తద్వారా బాదంపప్పు ప్రతిరోజు తింటే కచ్చితంగా ఫలితం ఉంటుంది.
పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, ఫ్లాక్ సీడ్స్ వంటి గింజలు కూడా జుట్టు ఎదుగుదలకు దోహద పడతాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో ఎండు ఆప్రికాట్ తినడం వలన కూడా జుట్టు కు ప్రయోజనం ఉంటుంది.
4. మజ్జిగ : మజ్జిగలో జుట్టు ఎదుగుదల అవసరమైన బి12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు లేదా తరచుగా మజ్జిగ తాగడం అలవాటు చేసుకుంటే జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది.
5. పండ్లలో స్త్రా బెర్రీ, బొప్పాయి, కీర దోసకాయ, గుమ్మడికాయ వంటివి జుట్టు ఆరోగ్యానికి మంచివి. స్ట్రాబెరీ లలో సిలికా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది.
బొప్పాయి పండులో సెబం ఉత్పత్తిని నియంత్రించే గుణం ఉంటుంది. ఇది కొలాజిన్ ఉత్పత్తిని ప్రేరేపించి వెంట్రుకలను రిపేర్ చేయడంలో దోహదపడుతుంది. ఇక కీర దోసకాయ జ్యూస్ తీసుకోవడం వలన జుట్టు పొడిబారకుండా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసేందుకు దోహదపడుతుంది.
6. గుడ్డు మరియు చేపలు: మాంసాహారం విషయానికొస్తే గుడ్డు మన శరీరానికే కాకుండా మన జుట్టుకి కూడా చాలా మంచి ఆహారం. గుడ్డులో బయోటిన్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు జుట్టు ఎదుగుదలకు ఎంతో అవసరం. ఇక చేపలలో ఫ్యాటీ ఫిష్ అనగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండేటటువంటి చేపలు జుట్టుకి మంచిది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేప నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ట్యూనా, సాల్మన్, ట్రేవల్లీ, మాకేరల్, స్నూక్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వులు ఎక్కువ గా ఉంటాయి. వీటిలో దాదాపు 18%–21% లిపిడ్ కంటెంట్‌తో ω-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఇవే కాకుండా అవకాడో, నేరేడు పండ్లు, యోగర్ట్ వంటివి కూడా జుట్టు కి మంచిది.
గమనిక: పైన పేర్కొన్న ఆహార పదార్థాలు అన్నీ కూడా సాధారణ లక్షణాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే. ఏవైనా ఫుడ్ ఎలర్జీ ఉన్న లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నా మీ వైద్యుని సంప్రదించిన తర్వాతనే పైన పేర్కొన్న ఆహారాలు తీసుకోనవలసి ఉంటుంది. ఇందులో పేర్కొనబడినటువంటివి వైద్యం సలహాకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.