కృత్రిమ మేధ (AI – Artificial Intelligence ) ఆధారిత టూల్ చాట్‌జీపీటీ (ChatGPT), Google Bard సహా ఇతర AI టూల్స్ తో ఉద్యోగుల భవిష్యత్ మరింత ప్రమాదంలో పడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్ అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుందనే నివేదికలు ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్‌ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని, చాట్‌జీపీటీ టూల్స్ స్వయంగా కోడింగ్‌ను రూపొందిస్తున్నాయి.టెక్ రంగానికి కావాల్సిన కోడ్లను ప్రామాణికంగా, మరింత ఖచ్చితత్వంతో అందించేందుకు సహాయపడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు జనరేటివ్ ఏఐ సైతం తనదైన ముద్రవేస్తుందని చెప్పారు.
తాజాగా బెంగళూరు(Bengaluru) కేంద్రంగా పనిచేసే దుకాణ్ (Dukaan) అనే ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే 90 శాతం మంది ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈవో సుమిత్ షా ట్వీట్ చేశారు.
టెక్కీల అవసరం ఉండదు
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ గిట్‌హబ్‌లో 41 శాతం కోడ్లను చాట్‌జీపీటీ తయారు చేసినవే. ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రోగ్రామర్లకు ముప్పు ఎక్కువగా ఉంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదని చెప్పారు.
ఇంటర్నెట్తో పనిలేదు
2024 ముగిసే సమయానికి అందరి ఫోన్లలో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు దీన్ని వినియోగించాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా కావాల్సిన కార్యకలాపాలన్నీ చాట్‌జీపీటీలో చక్కబెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడండి’ అని సీఈవో నొక్కి చెప్పారు. హెల్త్, సైన్స్ నిపుణులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అందుబాటులో ఉంచాలని, తద్వారా వారు తమ సామర్థ్యాన్ని, వేగాన్ని ఉపయోగించుకోగలరని అన్నారు.
భవిష్యత్తు ఎలా ఉండనుంది?
“అతి సర్వత్రా వర్జయేత్” అనే నానుడి మనం వినే ఉంటాం. ఏదైనా మితంగా ఉంటేనే దాని నుంచి ప్రయోజనం కూడా ఫలితాన్ని ఇస్తుంది. మనం తినే తిండి దగ్గర నుంచి మన అలవాట్ల పరంగా అన్ని క్రమశిక్షణతో మితంగా ఉండాలి. చివరకు మనం వాడే ప్రతి వస్తువుల పై కూడా మితిమీరి ఆధారపడటం మంచిది కాదు.
అదే కోవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ భవిష్యత్తులో ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ప్రతి దానికి మనం డిజిటల్ పద్ధతిని లేదా ఆన్లైన్ పద్ధతిని వినియోగిస్తున్నాం. ఫోన్ లేకుండా ఒక్కరోజు గడవడమే గగనం అయిపోయింది. ఇటువంటి తరుణంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నిపుణులు చేసే ప్రతి పనిని AI సులభంగా చేసేస్తుంది. దీని అర్థం నిపుణులను AI భర్తీ చేస్తుందనే కదా.
ఒక్క సాంకేతిక నిపుణులే కాదు, అన్ని రంగాలలో దీని ప్రభావం విపరీతంగా పడే అవకాశం ఉంది.
ఇటీవల AI ద్వారా ఆజ్ తక్ మరియు OTV వంటి ఛానెల్స్ ఏకంగా న్యూస్ రీడర్ లను AI యాంకర్ల ద్వారా భర్తీ చేశారు. దీనిని బట్టి ప్రతి రంగంలో ఉద్యోగాల కోత తప్పదని తెలుస్తుంది. ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోత, పరోక్షంగా పూర్తి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలా రంగాల్లో రోబోల వినియోగం పెరుగుతుంది. పలు హోటల్లో ఇప్పటికే కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేయడానికి కూడా రోబోలను వినియోగిస్తున్నారు. ఈ విధంగా చూస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్క రంగంలో మనిషిని AI భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రపంచ దేశాలు ఈ మితిమీరిన సాంకేతికతతో చివరకు తమ ఆర్థిక వ్యవస్థలను తమ చేతులారా కూల్చి వేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు.
మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అంటే ఇదేనేమో.. దీనిపై మీ ఒపీనియన్ ని కింది కామెంట్ ద్వారా తెలియజేయండి.