ఉగాది పచ్చడి తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా? ఉగాది పచ్చడి విశిష్టత మరియు తయారీ విధానం

తెలుగు రాష్ట్రాల లో ఉగాది పర్వదినాన్ని కొత్త సంవత్సరాది గా లేదా తెలుగు సంవత్సరాది గా జరుపుకుంటాము.చైత్ర మాసం ఆరంభాన్ని ఉగాది పండుగ గా జరుపుకోవడం మన సంప్రదాయం. కర్ణాటక లో యుగాది, మహారాష్ట్ర లో గుడీ పాడవ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం పేరుతో మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ఏ రాశి కి ఏ విధంగా ఉందనుందో తెలుసుకునేందుకు మనం పంచాంగ శ్రవణం వింటాము. అయితే వీటితో పాటు ఉగాది అనగానే మనకు గుర్తు వచ్చే ఏకైక వంటకం “ఉగాది పచ్చడి” . ఇది లేకుండా ఉగాది పూర్తి అవ్వదు.

మనిషికి అన్ని రుచులు మేలు చేస్తాయి. అన్ని రుచుల వంటకాలను సరైన మోతాదులలో తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఇతివృత్తం తోనే సంవత్సరం ఆరంభం రోజున ఈ షడ్రుచుల తో కూడిన ఉగాది పచ్చడి ని ఇంటిల్లి పాది తయారు చేసుకొని తింటాము.

ఉగాది పచ్చడికి ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడి తినడం వలన ఏ విధమైన బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయో చూసేయండి.

ఉగాది పచ్చడి తినడం వలన కలిగే లాభాలు [ Benefits of Ugadi Pacchadi ]

వేసవి ఆరంభంలో వచ్చే తొలి పండగ ఉగాది. వేసవి లో తలెత్తే అన్ని రకాల అనారోగ్యాలకు రోగనిరోధక శక్తిని అందించే ఆయుర్వేద మిశ్రమమే ఈ ఉగాది పచ్చడి.

ఉగాది పచ్చడి శరీరం లోని వాత, పిత్త, కఫా దోషాలను తగ్గిస్తుందని ఆయుర్వేద చెప్తుంది. ఈ పచ్చడి ఒక సమతుల్య వంటకం, ఇది మానవ శరీరాన్ని శుద్ధి చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది.

ఉగాది పచ్చడి లో ఆరు వేర్వేరు రుచులు ఉంటాయి. ఇవే: తీపి, ఉప్పు, చేదు, వగరు, కారం, మరియు పులుపు. ఈ షడ్రుచులు మనిషి జీవితంలోని ఆనందం,దుఖం, ఆశ్చర్యం, కోపం, భయం వంటి వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో ఈ పచ్చడిని తక్కువ మందంగా తయారు చేసుకుంటారు. తద్వారా ఔషద గుణాల తో పాటు ఇది వేసవికి శీతల పానీయంలా కూడా పనిచేస్తుంది.

ఉగాది పచ్చడి షడ్రుచుల లో ఏ రుచి వలన ఏ లాభం ఉంటుందో చూద్దాం

చేదు

ఉగాది పచ్చడి లో చేదు రుచి మనం అందులో వేసే వేప పువ్వుల నుండి వస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలతో పాటు చేదు క్షణాలు కూడా జీవితంలో ఒక భాగమే, కాబట్టి వాటిని మరచి పోకూడదు. ఈ చేదు రుచి మనకి ఈ గొప్ప భావాన్ని అందిస్తుంది.

ఇక హెల్త్ బెనిఫిట్స్ చూస్తే, ఆయుర్వేదం లో 35 రకాల వ్యాధులను నయం చేయడానికి వేపను సూచించడం జరుగుతుంది. వేపపూతతో శరీరంలోకి చేరిన పురుగులు, క్రిములు నశిస్తాయి. వేప ఆకులు, పూలు, పండ్లు, గింజలు, వేర్లు, బెరడు మరియు జిగురులో ఇలా వేప లోని అన్ని భాగాలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి.

తీపి

ఉగాది పచ్చడి లో ఉండే బెల్లం నుంచి తీపి రుచి వస్తుంది. తీపి రుచి జీవితంలో సంతోషకరమైన క్షణాలను సూచిస్తుంది.

ఇక బెల్లం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే, బెల్లం శరీరంలోని హానికరమైన విష పదార్థాలను బయటకు పంపేందుకు దోహద పడుతుంది. కాలేయాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగ పడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అయిన సెలీనియం మరియు జింక్‌ ను కలిగి ఉంటుందు, వీటి వలన ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ నివారించబడుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్స్ సోకకుండా శరీరం లోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అరటి పండు, తేనె కూడా కొందరు పచ్చడి లో వాడుతారు. అరటి పండులో ఎన్నో ఖనిజాలు లభిస్తాయి . అరటిపండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

వగరు

మనం ఉగాది పచ్చడిలో వేసే పచ్చి మామిడి కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. వేప పూతలో కూడా ఎంతో కొంత వగరనేది ఉంటుంది. పైన ఏవిధంగా తీపి సంతోషాన్ని చేదు కష్టాల్ని సూచిస్తాయో అదేవిధంగా వగరు మన జీవితంలో ఆశ్చర్యకరమైన అంశాలను, కొత్త సవాళ్ళను సూచిస్తుంది

ఇక పచ్చి మామిడి లో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. పశ్చిమామిడి రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తస్రావం వంటివి తగ్గిస్తుంది అదే విధంగా జీర్ణం వ్యవస్థలో ప్రేగులకు చాలా మంచిది. వేప మరియు మామిడి రెండు కలిపి రోగనిరోధక శక్తిని పెంచుతాయి అదేవిధంగా ఉగాది పచ్చడిలో తింటే వడదెబ్బ ని కూడా మనం తట్టుకునే శక్తి మనకి వస్తుంది. మీ కడుపు శుభ్రపరిచే దివ్య ఔషధంగా కూడా ఇది పనిచేస్తుంది.

కారం

షడ్రుచుల లో తర్వాత ముఖ్యమైనది కారం. కారం మన జీవితంలో కోపం అనే లక్షణాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో వేసే మిరియాల నుంచి మనకి కారం రుచి వస్తుంది.

మనం దాదాపు అన్ని కూరలలో కారాన్ని వాడుతాము. కారం ఒక సాధారణ ఇంగ్రిడియంట్ గా మన వంటల్లో మారిపోయింది. కారం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే, కారప్పొడి మన రోగ నిరోధక శక్తిని పెంచి చర్మ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

ఉప్పు (లవణం)

ఉగాది పచ్చడిలో మనం కొత్త ఉప్పును కూడా చేరుస్తాం. ఉప్పు లేనిదే ఏం కూర కూడా రుచించదు. అంటే ఉప్పు ఎంత ప్రాముఖ్యత చెందిందో మనకు తెలుసు. జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతమే ఉప్పు.

సాధారణంగా ఉప్పు అనేది కూరల్లోనే కాదు మన శరీరానికి కూడా చాలా అవసరం. తగిన మోతాదులో ఉప్పు తప్పనిసరిగా మన శరీరానికి అవసరం పడుతుంది.

మన కణాల సమతోల్యుత, పనితీరు, బాడీలో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ వంటి ప్రక్రియలకు ఉప్పు ఎంతో అవసరం. అయితే ఉప్పు ఎక్కువ తీసుకున్న కూడా నష్టమే. తగిన మోతాదులో మాత్రమే ఇది శ్రేయస్కరం.

పులుపు

షడ్రుచులలో మరొక ముఖ్యమైన మరియు చివరి రుచి పులుపు. పచ్చి మామిడి మరియు చింతపండు ద్వారా ఇది మనకి ఉగాది పచ్చడిలో లభిస్తుంది.

జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను పులుపు మనకు సూచిస్తుంది.

చింతపండు వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలో ఖనిజాల శోషణ కు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చింతపండు గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. చింతపండు వేయి వ్యాధులను నయం చేస్తుందని అంటారు. జీర్ణ క్రియ కు మరింత దోహదపడి చెడు కొలెస్ట్రాల్ ని కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మానికి కూడా ఇదే ఎంతో మేలు చేస్తుంది.

మరి ఇన్ని ఆరోగ్య గుణాలు ఉన్నటువంటి ఉగాది పచ్చడి ని తప్పకుండా తయారు చేసుకొని తింటారు కదా.

ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి?

ఉగాది పచ్చడి తయారీ విధానం ఇలా..

కావలసిన పదార్థాలు:

1 కప్పు నీరు

చింతపండు – 1 చిన్న నిమ్మకాయ సైజు అంత ముద్ద

బెల్లం – 1 చిన్న ముక్క

వేప పువ్వులు – 1 టేబుల్ స్పూన్

పచ్చి మామిడికాయ – 1 చిన్నది, తరిగినది

మిరియాల పొడి – రుచికి సరిపడా

ఉప్పు – చిటికెడు

అదనంగా

అరటిపండు – కొన్ని ముక్కలు రుచికి తగ్గట్లు

ఉగాది పచ్చడి ఎలా చేయాలి

మామిడికాయ అంచులను కత్తిరించి, సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టండి.

చింతపండును 1/2 కప్పు నీటిలో 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత గుజ్జును పిండి రసం తీయండి పిప్పి నీ పడేయండి.

ఆ తరువాత, మిగిలిన 1/2 కప్పు నీటిని చింతపండు గుజ్జు లో కలపండి. అందులో బెల్లం పొడి జోడించి కరిగే వరకు ఒక చెంచాతో బాగా కలపండి.

ఆపై తరిగిన పచ్చి మామిడి ముక్కలను చింతపండు-బెల్లం నీటిలో వేయండి. అదనంగా అరటిపండు ముక్కలను వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వేప పువ్వు, ఆపై రుచికి చిటికెడు లేదా రుచికి సరిపడా ఉప్పు వేయండి. చివరగా, మిరియాల పొడి వేసి కలపాలి.

అన్నిటిని కలిపిన తర్వాత, నోరూరించే ఉగాది పచ్చడి రెడీ..

ఇంటిలిపాది ఎంతో సంతోషంగా ఉగాది పచ్చడి ని ఆస్వాదిస్తూ, పంచాంగ శ్రవణం వింటూ మీ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఉగాది శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. – studybizz


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!