Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి.

జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచ వచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు.

ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టీలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

బాండ్ల కొనుగోలు..

రూ.1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్లలో ఈ బాండ్ల అమ్మకం ఉంటుంది. సాధారణంగా ఈ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. అదే సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా 30 రోజులు అనుమతినిస్తుంది. విదేశాల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనే పరిమితి కూడా ఉంది.

ఇవి ఎవరికి లాభం..?

విరాళాలను ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచారని, ఇది నల్లధనం చలామణిని ప్రోత్సహిస్తున్నదని దేశంలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలు తమ గుర్తింపును వెల్లడించకుండా రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా అందించడానికి ఈ స్కీమ్ రూపొందించబడింది. ఇది అధికార పార్టీకి విరాళాలు ఎక్కువగా రావడానికి వేసిన ప్లాన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాలని అనుకునేవారు ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు.

అభ్యంతరాలు

  • బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు.
  • భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది.
  • పైగా ఈ బాండ్లతో అధికార పార్టీలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం.
  • మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టీలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది.
  • పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టీలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు.
  • దేనిపై వెచ్చించాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు.
  • ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది.
  • దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారులు వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టీలకు ఉంటుంది.
  • తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది.

గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ.16437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే రూ.10117 కోట్లు రావడం సంచలనంగా మారింది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం, కాంగ్రెస్‌ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!