రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.
ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్
బిల్లులను గృహనిర్మాణ శాఖ చెల్లిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రెండు దశల్లో 21.25 (18.63 లక్షలు సాధారణ +2.62 లక్షలు టిడ్కో) లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. సాధారణ ఇళ్లలో ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా నిర్మాణం పూర్తయింది.
మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, బిలో బేస్మెంట్ లెవల్ (బీబీఎల్), బేస్మెంట్ లెవల్ (బీఎల్) దశల్లో ఇంటి నిర్మాణం ఉన్న లబ్ధిదారులకు రూ.20 వేలు, ఆ పై దశల్లో ఇంటి నిర్మాణం ఉన్న వారికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ అడ్వాన్స్ రూపంలో బిల్లు చెల్లిస్తున్నారు.
సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా అడ్వాన్స్ బిల్లులు అవసరం అని భావించే లబ్దిదారుల సమాచారాన్ని సేకరించి చెల్లింపులు చేస్తున్నారు.
ఇలా ఇప్పటివరకు 2,79,926 మంది లబ్ధిదారులకు రూ.111.17 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అడ్వాన్స్ మొత్తం అవసరం ఉన్న లబ్ధిదారుల సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా.. ఇంటి నిర్మాణానికి ఒక్కో యూనిట్కు ప్రభుత్వం రూ.1.80 లక్షలు చొప్పున బిల్లులు ఇస్తోంది. ఈ మొత్తాన్ని వివిధ నిర్మాణ దశలు పూర్తయిన అనంతరం విడతలవారీగా చెల్లిస్తారు.
నిర్మాణ దశ పూర్తయిన అనంతరమే బిల్లు మంజూరు అవుతుండటంతో తొలుత చేతి నుంచి డబ్బు పెట్టి నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. దీంతో పనులు నెమ్మదిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బిల్లుల్లో కొంత మేర ముందగా చెల్లిస్తే లబ్ధిదారులు బయట అప్పులు చేసి వడ్డీలు కట్టే బాధ వారికి తప్పుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులపై అదనపు భారం పడకుండా
ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. యూనిటు రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు, పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తోంది.
అంతేకాకుండా ఉచితంగా ఇసుక ఇవ్వడంతో పాటు సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా ద్వారా రూ. 40 వేలు చొప్పున ప్రతి లబ్ధిదారుకు మేలు చేకూరుతోంది.
Leave a Reply