దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.
తెలంగాణలో నవంబరు 30న, రాజస్థాన్‌లో నవంబరు 23న, మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న, మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7న తొలి విడత, నవంబరు 17న రెండో విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.
తెలంగాణ ఎన్నికల తేదీలు..
నోటిఫికేషన్ తేదీ | నవంబరు 3 |
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ | నవంబరు 10 |
నామినేషన్ల పరిశీలన | నవంబరు 13 |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | నవంబరు 15 |
పోలింగ్ తేదీ | నవంబరు 30 |
ఓట్ల లెక్కింపు | డిసెంబరు 3 |
తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా..
తెలంగాణలో మొత్తం 3.17కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.58 కోట్లు, మహిళా ఓటర్లు 1.58 కోట్లు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు 8.11లక్షలు (18-19ఏళ్ల వయసు). దివ్యాంగులు 5.06లక్షలు. 80ఏళ్ల వయసు పైబడిన వారు 4.4లక్షలు (వీరికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది). వందేళ్ల వయసు దాటిన ఓటర్లు 7005 మంది ఉన్నారు. ఈ సారి కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 17,01,087గా ఉంది.
రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్‌క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27798 (78శాతం). 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొత్తం 148 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
Leave a Reply