దేశంలో బియ్యం ధరలు భగ్గుమంటున్న వేళ మోడీ సర్కార్ చల్లని కబురు చెప్పింది.భారత్ రైస్ ను అందుబాటులోకి తెస్తోంది. కేజీ 29 రూపాయలకే అందించనుంది. ఈ రైస్ విక్రయాలు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం అయ్యాయి.
భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి తగ్గడం మాట వాస్తవమే కాని దాన్ని చూపించి, వ్యాపారులు ధరలను భారీగా పెంచేస్తున్నారు. ఆఖరికి బియ్యం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన ధరలను అదుపులోకి రావడం లేదు. మరి విడ్డూరంగా బియ్యం ధర 15 శాతం పెరిగి పోయిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ బియ్యం ఎక్కడ విక్రయిస్తారు?
భారత్ రైస్ పేరిట రూ.29కే కిలో సన్న బియ్యం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయించనుంది. అలాగే ఇ- కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు సంజీవ్ చోప్రా. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తామని తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్ర నిర్ణయించినట్లు వెల్లడించారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో రూ. 27.50, భారత్ దాల్ శనగ పప్పును కిలోకు రూ. 60 చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘ భారత్ రైస్‌ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్లి కొనుగోలు చేయవచ్చు. అలాగే త్వరలోనే ఇ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది. రోజు వారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు, వోల్ సేలర్స్, రిటైల్స్, బిగ్ చైన్ రిటైల్స్, ప్రాసెసర్స్, మిల్లర్లు వెల్లడించాలని ఆదేశించింది కేంద్రం. ‘ అని తెలిపారు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా. మరోవైపు.. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు చోప్రా. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేశారు.