2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో నియమితులైనటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి ఏంటి. గతంలో వాలంటీర్లు వైకాపాకు మద్దతుగా ఉన్నారని కూటమి ఎన్నోసార్లు విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం లో వారి స్థానం ఏంటి అనే పలు అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి వాలంటీర్లపై పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని పలు సంస్కరణలు చేపట్టి ఉన్నవారికి పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించడం జరిగింది.
మరి ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉండనుంది?
గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు లోకేష్ వాలంటీర్లకు సంబంధించి ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది.
డిగ్రీలు చదివిన వారిని 5000 రూపాయల ఉద్యోగాలకు నియమించారని విమర్శలు చేశారు. వీరిని పర్మినెంట్ చేస్తామని వీరిని సచివాలయాలు కాకుండా పంచాయతీలతో అనుసంధానం చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది.
అదేవిధంగా వీరికి పదివేల రూపాయలు పారితోషం ఇవ్వనున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది.
వైకాపాకు అనుకూలంగా ఉన్నటువంటి వాలంటీర్లను ఇప్పటికే ఆ రాజకీయ పార్టీ వారు ముకుమ్మడి రాజీనామాలు చేయించిన విషయం తెలిసింది. అయితే రాజీనామాలు చేసి వెళ్లిపోయిన వారు పక్కన పెడితే మిగిలిన సుమారు రెండు లక్షల మంది వాలంటీర్ల ను ఏ విధంగా వినియోగించనున్నారు అనే దానిపైన సర్వత్రా చర్చ నడుస్తుంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
- వాలంటీర్లకు పదివేల పారితోషకం ఇవ్వనున్నారు.
- వాలంటీర్లను నేరుగా పంచాయతీలు మరియు సర్పంచులకు అనుసంధానం చేసే అవకాశం ఉంది.
- వాలంటీర్లతోపాటు సచివాలయాల సిబ్బందిని కూడా పంచాయతీలు మరియు సర్పంచ్ అధ్యక్షతన అనుసంధానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి
- వాలంటీర్ల సంఖ్య కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
- ఇక వాలంటీర్లు ప్రతినెల ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తుండగా, ఎన్నికల సమయంలో వీరిని పూర్తిగా దూరం ఉంచటం జరిగింది. నేరుగా బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అమౌంట్ జమ చేయగా, పలువర్గాల వారికి మాత్రమే ఇంటింటికి సచివాలయ సిబ్బంది పెన్షన్ వేసింది. ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
- అదేవిధంగా వాలంటీర్ల క్వాలిఫికేషన్ ఆధారంగా ఉత్తీర్ణులైన కటాఫ్ సంవత్సరాలను కూడా సవరించే అవకాశం కనిపిస్తుంది.
అయితే ఇప్పటికే గత ప్రభుత్వ నాయకులను అనుసరించి రాజీనామాలు సమర్పించినటువంటి వాలంటీర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పారితోషకం పరంగా వాలంటీర్ల జీతం పదివేలకు పెంచడం మంచి పరిణామమే అయినప్పటికీ వాలంటీర్ల సంఖ్య తగ్గిస్తారన్న విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక జూలై 1 లోపు పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తుంది.