జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.
విద్యార్థులకు మరో విడత జగనన్న విద్యాదీవెన అందించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నగదు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమం కృష్ణాజిల్లా పామర్రులో నిర్వహించనున్నారు.
ఉమ్మడి ఖాతాల్లోనే జమ..!
జనగన్న విద్యా దీవెన స్కీమ్ మొదలైనప్పటి నుంచి డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే.. గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు, తల్లుల పేరుతో ఉండే ఉమ్మడి బ్యాంకు ఖాతాల్లోనే ఈ స్కీమ్ డబ్బులను జమ చేయనున్నట్లు తెలిపింది. జాయింట్ అకౌంట్ లేని వారు కొత్తగా ఓపెన్ చేయాలని సూచించింది. అయితే నాలుగవ విడత లోగా ఈ ఖాతా తెరవాలని మొదటగా చెప్పినప్పటికీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది
NPCI మ్యాపింగ్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు.