తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజులకు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా దూసుకుపోతోంది.
ఫిబ్రవరి చివరి వారంలో ఉచిత కరెంట్ మరియు 500 సిలిండర్
ఇప్పటికే ఉచిత ప్రయాణం మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా పెంపు వంటివి అమలు చేసిన ప్రభుత్వం , మరో వారం రోజులలో అనగా ఫిబ్రవరి నెలాఖరులోగా 200 యూనిట్ల వరకు ఉన్నవారికి ఉచిత కరెంట్ మరియు ₹500 రూపాయలకే సిలిండర్ వంటి మరో రెండు హామీలను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అధికారం చేపట్టాక తొలిసారి సొంత నియోజక వర్గంలో పర్యటించిన ఆయన, కోస్గి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. నియోజక వర్గంలో ₹4369 కోట్ల తో 20 అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు.
తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారందరికి ఈ రెండు పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
మార్చ్ 15 న రైతు బంధు, రైతు భరోసా అమలు, రుణ మాఫీ
ఇదే పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. మార్చ్ 15 న కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఎకరా కు ప్రతి ఏటా 15 వేల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. అదే విధంగా 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసే బాధ్యత కూడా తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.