తెలంగాణ లో సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ లో సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు, ధరణి, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ తదితర అంశాలపై సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయం జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించినటువంటి ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.

వీటిలో కింద ఇవ్వబడిన అంశాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి వీటిపైన ముఖ్యమంత్రి సమీక్షించి ఆదేశాలు ఇచ్చారు .

  • అర్హులైన అందరికీ ఆరుగారంటీలు అందేలా చూడాలని ఆదేశాలు
  • ఆగస్టు 15లోగా తరలి సమస్యలు పరిష్కరించాలని అన్నారు
  • ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహించుకునేలా మహిళా సంఘాలకు అవకాశం
  • రేషన్ కార్డు లేకున్నా పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించాలి
  • పటిష్టమైన నిఘాతో ప్రభుత్వ భూములు ఆస్తులు నూ పరిరక్షించడం అవసరం

రాష్ట్రంలో ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతల తో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు..ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ప్రజాప్రభుత్వం మార్కు కనబడేలా కలెక్టర్లు పని చయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని..జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85వేలు ఖర్చు పెడుతుందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్ లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు.

ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయాలి

ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, అయిదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

ఆగస్టు 15లోపు ధరణి సమస్యల పరిష్కారం..

పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు..

మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.

ప్రభుత్వ భూములు, ఆస్తులపై పటిష్ట నిఘా

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెర్వులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి.. ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు.

రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ సేవలు..

ఆసుపత్రుల్లో సేవలపై..రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్లకు పారితోషికం అందించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చెప్పారు. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యం తీసుకొని వాటి నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

You cannot copy content of this page