తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు పథకాలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.
మరో మూడు పథకాలకు డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇవ్వగా ఇందుకు సంబంధించినటువంటి కార్యచరణ వేగం సంతరించుకుంది.
ఫిబ్రవరి 27 న రెండు పథకాలు: 500 కే గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత కరెంట్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక మార్చి 15న రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో 500 గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
500 కే సిలిండర్ అయితే నగదు బదిలీ రూపంలో
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించనున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని నగదు బదిలీ పథకం రూపంలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
అనగా పూర్తి చెల్లించి వినియోగదారుడు సిలిండర్ కొనడం జరుగుతుంది ఆ తర్వాత సిలిండర్ ధరలో 500 వినియోగదారుడు భరిస్తే మిగిలిన మొత్తం ఏదైతే ఉంటుందో అది సబ్సిడీ రూపంలో వినియోగదారుని యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు హైదరాబాద్ ghmc పరిధిలో సిలిండర్ ధర 955 రూపాయలు ఉండగా, సిలిండర్ తీసుకునేటప్పుడు వినియోగదారుడు పూర్తి అమౌంట్ చెల్లిస్తాడు. ఆ తర్వాత ఇందులో 500 రూపాయలు వినియోగదారుని వాటాగా ఉంటే, మిగిలిన 455 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తాన్ని వినియోగదారుని యొక్క ఖాతాకి రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ చేస్తుంది.
500 కే సిలిండర్ అర్హులు వీరే
తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇందులో కూడా సిలిండర్ వాడుకలో ఉన్న వారిని మాత్రమే రాష్ట్రప్రభుత్వం అర్హులుగా పరిగణలోకి తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందిని ఈ విధంగా అర్హులుగా గుర్తించింది.