ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా?.. లేదా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై గందరగోళం కొనసాగుతోంది. జూన్ నెలలో పింఛన్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ జరిగింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొందరు మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు.. దీంతొ కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.. వారంతా ఢిల్లీకి వెళ్లారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అంతకుముందు సభకు నివేదించిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ఉందన్నారు.
అంతేకాదు రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లైంది.
ప్రభుత్వం వాలంటీర్ల వ్యవసప్థ కొనసాగిస్తామని.. వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే వాలంటీర్ల విషయంలో మరికొన్ని క్లారిటీలు రావాల్సి ఉంది.
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే.. ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్నవారి పరిస్థితి ఏంటి, రాజీనామా చేసిన వాళ్ల సంగతేంటి, కొత్తవారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా అనే ప్రశ్నలపై క్లారిటీ లేదు. అలాగే వాలంటీర్లకు ఎలాంటి విధులు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది.