ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు goir.ap.gov.in వెబ్సైట్లో… తాజా ఉత్తర్వులు విడుదల

ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు goir.ap.gov.in వెబ్సైట్లో… తాజా ఉత్తర్వులు విడుదల

ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీఓనూ జీఓఐఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. ప్రజలంతా వాటిని స్వేచ్ఛగా చూడొచ్చు. ఈ మేరకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌. మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒకప్పుడు సచివాలయంలోని ప్రతి సెక్షన్‌లోనూ జీఓలకు మాన్యువల్‌ రిజిస్టర్లు నిర్వహించేవారు. వాటిలో నంబరు రాసి, జీఓలు విడుదల చేసేవారు. సాధారణ ప్రజలకు అవి తెలిసేవి కావు. సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చాక… ప్రతి జీఓనూ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్‌ రావడంతో, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం జీఓఐఆర్‌ పోర్టల్‌ను రూపొందించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలన్నీ దాన్ని కొనసాగించాయి. కానీ, జగన్‌ ప్రభుత్వం జీఓల విషయంలోనూ ‘రివర్స్‌’ ధోరణినే అనుసరించింది. జీఓఐఆర్‌ పోర్టల్‌ను మూసేసి… 2008కి ముందున్న మాన్యువల్‌ విధానాన్ని అమల్లోకి తెస్తూ 2021 ఆగస్టు 15న ఉత్తర్వులు జారీచేసింది. పాలనలో పారదర్శకతకు స్వాతంత్య్ర దినోత్సవం రోజునే పాతరేసింది.

గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు జీఓఐఆర్‌ను కొనసాగించింది. కానీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల గురించి ప్రజలకు తెలిసిపోవడం, వాటి వెనక వాస్తవాలపై మీడియాలో చర్చ జరగడం, సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోయడం, కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు రావడంతో జగన్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. దీంతో జగన్‌ ప్రభుత్వం కొన్నాళ్లపాటు ఆన్‌లైన్‌లో జీఓల నంబర్లే పెట్టి, మిగతా అంతా ఖాళీగా ఉంచేసేది. జీఓ నంబరును బట్టి… ఆయా శాఖల్లో సంప్రదించి సమాచారం తెలుసుకోవాల్సి వచ్చేది. కొంత ఆలస్యంగానైనా సమాచారం బయటకు వచ్చేది. ఇలా లాభం లేదనుకున్న జగన్‌ ప్రభుత్వం ఏకంగా జీఓఐఆర్‌ పోర్టల్‌నే మూసేసింది.

జీఓఐఆర్‌ను మూసేయడం సమాచారహక్కు చట్టానికి విఘాతమేనని, దాన్ని అందుబాటులోకి తేవాలని కొందరు కోర్టుకు వెళ్లారు. దాంతో ప్రభుత్వం 2021 సెప్టెంబరు 7న జీఓ నం.100 జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని టాప్‌ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్‌ నేచర్‌… అని నాలుగు కేటగిరీలుగా విభజించి, రొటీన్‌ నేచర్‌ జీఓలనే ఏపీ ఇ-గెజిట్‌ పోర్టల్‌లో వారానికోసారి అప్‌లోడ్‌ చేస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఉంటే ప్రజలు తమకు కావలసిన సమాచారం వెతుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వారికి అవసరమైనవాటినే పెడతామని సాకులు చెప్పింది. మొత్తం జీఓల్ని అప్‌లోడ్‌ చేయాలని కోర్టు ఆదేశించినా… జగన్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 2021 ఆగస్టు 15 నుంచి జగన్‌ ప్రభుత్వం జారీచేసిన మొత్తం జీఓల్లో 7% మాత్రమే ఇ-గెజిట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక… మొత్తం జీఓలన్నీ ఇ-గెజిట్‌తో పాటు, ఏదోలా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న జీఓఐఆర్‌ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించి, మొత్తం జీఓలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా పారదర్శక పాలనకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ దిశగా చర్యలు చేపట్టింది.

ఈ ప్రభుత్వం జారీచేసే జీఓలతో పాటు… 2021 ఆగస్టు 15 నుంచి జగన్‌ ప్రభుత్వం జారీచేసిన మొత్తం జీఓలను జీఓఐఆర్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చాలా ఉత్తర్వుల్ని మెమోలు, యూవో నోట్‌ల రూపంలో ఇచ్చిందని, వాటినీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేవాలని వారు కోరుతున్నారు. జగన్‌ హయాంలో పుస్తకాల్లో నమోదుచేసిన జీఓలు వెంటనే ఆన్‌లైన్‌లోకి తేకపోతే, రోజులు గడిచేకొద్దీ ఆ పుస్తకాలు, జీఓలు మాయమయ్యే అవకాశముందని చెబుతున్నారు.

You cannot copy content of this page