ఆంధ్రప్రదేశ్‌లో జులై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు.
అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించింది.
నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ₹20, సీనరేజ్ కింద టన్నుకు ₹88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు.
వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది.
ఈ మేరకు ఉచిత ఇసుక విధానంకు సంబంధించి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు వివరించారు. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్లు.. జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇసుక నిల్వలను స్థానిక కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు లెక్కించారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందించనున్నారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని గుర్తించారు. సంవత్సరానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు.
ఆయా జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటించనున్నారు. ఆ ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నదుల్లో ఇసుక అక్రమంగా తవ్వకుండా.. నిల్వ కేంద్రాల నుంచి తీసుకుంది అక్రమంగా విక్రయాలు జరపకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లు నిఘా ఉంచనున్నాయి. రీచ్‌ల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీచేయనున్నారు.