ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగానికి మరియు ఇల్లు నిర్మించుకునే వారికి శుభ వార్త. కూటమి ప్రభుత్వం తిరిగి ఇసుక ను ఉచితం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఇసుక పాలసీ ద్వారా ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇసుకను ముందుగా బుక్ చేసుకోవాల్సి వచ్చేదని, తద్వారా స్థానిక నాయకులు దోచుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఇకపైన పూర్తిగా ఉచితంగా ఇసుకను పొందవచ్చు అని తెలిపింది. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు వెల్లడించారు.
జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో విధివిధానాలు విడుదల చేస్తామని అన్నారు. అయితే కేవలం ఇసుక లోడింగ్ చేసేందుకు మరియు రవాణా చార్జీలు చెల్లించి ప్రజలు ఉచితంగా ఇసుకను పొందవచ్చని వెల్లడించారు. అయితే ఆయా జిల్లాలకు సంబంధించి లోడింగ్ మరియు రవాణా చార్జీలు ఎంత మేర నిర్ణయించాలో కలెక్టర్లు అధ్యయనం చేసి నిర్ధారిస్తారని తెలిపారు. స్టాక్ పాయింట్లలో ఉన్నటువంటి ఇసుకను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాదిమంది ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు మరియు కూలీలు లబ్ధి పొందుతారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.