ఏపిలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకుండా కీలక ఆదేశాలు

ఏపిలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకుండా కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి నెల గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల తో పెన్షన్ పంపిణీ చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ తో పాటు ఇతర ఏ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు కూడా వాలంటీర్ల తో పంపిణీ చేయరాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

ఇప్పటికే వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచిన ఎన్నికల కమిషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా వాలంటీర్లు ఉపయోగించే పరికరాలు , ఫోన్ లు వెంటనే స్వాదీనం చేసుకోవాలని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వీటిని వినియోగించరాదని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ సహ దేశవ్యాప్తంగా జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. కాబట్టి ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి పెన్షన్ పంపిణీ లో వాలంటీర్లు భాగస్వామ్యం కానట్లే.

అయితే పెన్షన్ పంపిణీ కోసం ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవచ్చని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

పెన్షన్ లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు పంపిణీలో భాగంగా వాలంటీర్లను దూరంగా ఉంచాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఈసిఐ తెలిపింది.

ఇక ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ సంబంధించి మూడు రోజులు ఆలస్యంగా పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి చేపట్టనున్నారు.

You cannot copy content of this page