ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లో రేషన్ కార్డులు లబ్దిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పండగల సమయంలో భారీగా పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు ఊరటగా, తక్కువ ధరకే వంట నూనెలు అందించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే ఈ నెలాఖరు వరకే వంటనూనెలను తక్కువ ధరకు అందించనున్నట్లు తెలిపారు. ఇక ఈ తక్కువ ధర వంట నూనెలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వంట నూనెలు ఎక్కడ తీసుకోవాలి?
నేటి (అక్టోబర్ 11 ) నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఈ వంట నూనెలు అందుబాటులో ఉంటాయి అని మంత్రి తెలిపారు. పామోలిన్ లీటరు (850 గ్రాములు) రూ.110లకు అందించనుండగా.. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నారు. ఒక్కో రేషన్ కార్డుపై గరిష్ఠంగా 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు పేర్కొన్నారు.
వంట నూనెల ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
అక్టోబర్ 10న విజయవాడ పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంట నూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్, ధరల నియంత్రణపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ లాంటి దేశాల నుంచి భారత్‌కు వంట నూనెల దిగుమతులు తగ్గినట్లు పేర్కొన్నారు. దీనికితోడు పన్నులు, ప్యాకేజి ఖర్చులు కూడా పెరగడంతో వంట నూనెల ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా.. రాష్ట్రం మొత్తం ఒకే ధరపై వంట నూనెలు విక్రయించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాపారులకు సూచించారు.