New Pensions AP 2024: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవ్వ తాతలకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్ల తేదీ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త పెన్షన్ల పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
సెప్టెంబర్ 20 తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ముదిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు.
అక్టోబర్ 2024 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు
అక్టోబర్ నెలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఆ నెల మొత్తం ఇదే కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ పెన్షన్లను అందిస్తామని వెల్లడించారు.
కొత్త పెన్షన్లకు కావలసిన అర్హతలతో త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నకిలీ పెన్షన్లు తొలగింపు ప్రక్రియకు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. అర్హులైన వారందరికీ పెన్షన్ డబ్బులు అందేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలు మరియు పలు వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న చాలామంది ఈ పెన్షన్ కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
సచివాలయాలలో త్వరలో అర్హులు మరియు అనర్హుల జాబితా ప్రదర్శన
ప్రస్తుతం అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆరు అంచెల ధ్రువీకరణ అనేది ప్రస్తుతం ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో దీనినే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏమైనా సవరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఆరు అంచెల ధ్రువీకరణ ఉండి అర్హత ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే పెన్షన్ అందట్లేదో అటువంటి వారికి కూడా వచ్చే నెల అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా అనర్హత ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నటువంటి వారిని తొలగించనున్నారు. వివిధ శాఖల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం డేటాను సేకరిస్తుంది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఎవరైతే అర్హులు మరియు అనర్హులుగా గుర్తింపబడతారో వారి జాబితాలను గ్రామ వార్డు సచివాలయాలలో త్వరలో ప్రదర్శించనున్నారు. ఈ విధంగా ప్రదర్శించినటువంటి డేటా పై అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరుగుతుంది.