ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..గ్రామ సచివాలయాల పేరు మార్పు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..గ్రామ సచివాలయాల పేరు మార్పు

ఏపీలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో కీలక మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సచివాలయాల్లో సిబ్బందిని ప్రక్షాళన చేయడంతో పాటు ఎక్కువగా ఉన్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరికొన్ని మార్పులకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముందుగా గ్రామ సచివాలయాల పేరును మార్చబోతున్నట్లు సమాచారం.

గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీవోలుగా సంక్షేమ శాఖ చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్లను నియమించే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితా తయారీ ప్రక్రియ బాధ్యతలను గ్రామ సంక్షేమ కార్యాలయాలకు అప్పగించి రాజకీయ వత్తిడులకు ఎలాంటి అవకాశం లేకుండా చేయాలనేది ఆలోచన. గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయాన్ని విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు.

అక్టోబరు 2 గాంధీ జయంతి నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో అయిదుగురు సిబ్బందిని నియమించనున్నట్టు తెలిసింది.

మరోవైపు గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30 లోపు చేసి అక్టోబర్ 2 నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పని చేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సిబ్బంది ప్రక్షాళన ఎలాగో ఉండబోతోంది.

You cannot copy content of this page