ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
వాలంటీర్ల వ్యవస్థపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినేట్ సమావేశంలో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు..
- పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడిన మంత్రివర్గం
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ‘స్టెమీ’ పథకం ప్రారంభం
- ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు
- హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు.. కొత్త కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్
- వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు