AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపు.. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపు.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ.. ఈ పనుల్లో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత.. 22ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు రూ. 11.51 నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో పోర్టిఫైడ్ బియ్యం అందించాలని.. పోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వల్ల రూ. 330 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీ.. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజన్ 2047 రూపకల్పన పై కేబినెట్‌లో చర్చ జరిగింది.. కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశంపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై చర్చించారు.
ఈసారి పేపర్ లెస్, ఈ- కేబినెట్ సమావేశం నిర్వహించారు. 2014-2019 మధ్య అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్వహించింది.. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ దాన్ని పునరుద్ధరించింది. మంత్రివర్గ సమావేశంలో అజెండా ననుంచి నోట్స్ వరకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేసింది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రులకు, వారి పీఏలకు సాధారణ పరిపాలన శాఖ శిక్షణ ఇచ్చింది. అధికారులు మంత్రులకు ట్యాబ్‌లు కూడా కేటాయించారు.