ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటూ ఈ మూడు పక్కా

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటూ ఈ మూడు  పక్కా

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో.. పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ధరలపై కందిపప్పు, పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 3 నెలలకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయనుంది.

బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, గోధుమపిండి సరఫరా కోసం పౌరసరఫరాల శాఖ (సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్)‌ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 22,500 టన్నుల కందిపప్పుతో పాటుగా 17,538 టన్నుల పంచదార సేకరణ కోసం టెండర్లు ఆహ్వానించారు. అయితే పంచదార సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్‌ చేశారు.. దీంతో పౌరసరఫరాలశాఖ టెండరు ప్రక్రియను రద్దుచేసి, మళ్లీ రెండోసారి టెండర్లను పిలిచారు.

ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ-పొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. వచ్చేనెల నుంచి కార్డుదారులకు రాయితీపై రూ.67కే కిలో కందిపప్పును అందిస్తారు. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేస్తారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు ఇంటింటికీ అందిస్తామని చెప్పారని.. కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలిపింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాలశాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నిత్యావసర వస్తువుల తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతానికి వాటిని ఆపేశారు.. ఆ సమస్యల్ని పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని పంపిణీ చేయనున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరకులను రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందిస్తోంది. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో రైతుబజార్లలో బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేసి.. బియ్యం, కందిపప్పు అందజేస్తున్నారు. ఈ కౌంటర్లో కందిపప్పు రూ.160, సోనా మసూరి బియ్యం కిలో రూ.49కి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్లలో రాయితీపై అందిస్తున్న సరకులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలియజేశారు.

పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించామన్నారు.. అందుకే పంపిణీని ఆపేశారు. తూకం తేడాలపై సంబంధింత అధికారులు, డీలర్లపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page