మధ్యతరగతి ప్రజలకు అనువుగా నూజివీడులో ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో అభివృద్ధి చేసిన ప్లాట్ల దరఖాస్తు గడువును ఈనెల 31వతేదీ వరకు పెంచినట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీ మ్యాంగో గార్డెన్ రీసెర్చ్ సెంటర్ను ఆనుకొని 40.78 ఎకరాల విస్తీర్ణంలో 150, 200, 250 చదరపు గజాల వైశాల్యంలో మొత్తం 393 ప్లాట్లను అభివృద్ధి చేసినట్లు వివరించారు.
ఇక్కడ చదరపు గజం ధర రూ.8,500గా నిర్ణయించామని, కొనుగోలుదారులు సులభ వాయిదాల్లో నగదు చెల్లించవచ్చన్నారు. ఈ పాట్లకు ఉన్న అధిక డిమాండ్తో పాటు ప్రజల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు ఆయన తెలిపారు. ఉద్యోగులకు 20శాతం రాయితీ..పట్టణంలో డిమాండ్ ఉన్న ప్రాంతంలోని ఈ లేఅవుట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లు, నూజివీడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కోసం 5శాతం ప్లాట్లు రిజర్వు చేసినట్లు వివేక్ యాదవ్ తెలిపారు.
వీరికి ప్లాటు ధరలో 20శాతం రాయితీ కూడా కల్పించామన్నారు. ప్రభుత్వ అనుమతులతోపాటు అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్లను అమ్మకం ధరలో 10శాతం మొత్తాన్ని చెల్లించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అన్నారు.
ఇతర వివరాలకు https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చని, సందేహాల నివృత్తికి 0866 – 2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Leave a Reply