ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు శుభవార్త. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేసే స్కూల్ కిట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆయా కిట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లకు పిలవగా.. గతంలో కంటే నాణ్యమైన కిట్లను తక్కువ ధరకే టెండర్లు గుత్తేదారులు దక్కించుకున్నారని.అధికారులు చెబుతున్నారు.
నూతన టెండర్ల ద్వారా రూ.63.79 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యాకానుక పేరుతో కిట్లను పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర స్టూడెంట్ కిట్ గా పేరు మార్చి పంపిణీ చేస్తోంది.అయితే.. గతంలో కంటే నాణ్యమైన వస్తువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిలో భాగంగా ప్రతి విద్యార్ధికి ఓ బ్యాగ్, ఒక జత బూట్లు, బెల్ట్, మూడు జతల యూనిఫాం క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇక దీనికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తికావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి పంపిణీ చేయాలని విద్యాశాఖ పనులు వేగవంతం చేసింది.
గత ప్రభుత్వంతో పోల్చితే.. కూటమి ప్రభుత్వం టెండర్ల విషయంలో ఆచితూచి వెళ్తుంది. ఎక్కువమంది గుత్తేదారులను పిలిచి.. ధర తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో గతంలో కంటే తక్కువ ధరలకే కిట్లను పంపిణీ చేసేందుకు గుత్తేదారులు ముందుకొచ్చారు.
ఇప్పటికే టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో విద్యార్థికి ఇచ్చే ఒక్కో బెల్టును సగటున రూ.34.50కి కొనుగోలు చేస్తే.. తాజాగా ఒక్కో బెల్టుకు రూ.24.93కు అందించేందుకు గుత్తేదారు సంస్థ ఓకే చెప్పింది.గతంలో ఒక్కో నోటు పుస్తకాన్ని రూ.50 అయితే.. ఇప్పుడు ఒక్కో పుస్తకం ధర రూ.35.64కు వచ్చింది, గతంలో సగటు బ్యాగ్ ధర రూ.272.92 అయితే.. ఇప్పుడు మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు.. ఒక్కోటి రూ.250కి సరఫరా చేయనున్నారు.
గత ప్రభుత్వంలో జత బూట్లు, రెండు జతల సాక్సులకు కలిపి సగటున రూ.187.48 చొప్పున గుత్తేదారుకు చెల్లించగా.. ఇప్పుడు రూ.159.09కే ఇస్తామని ముందుకొచ్చారు. అదేవిధంగా మూడు జతల యూనిఫామ్ గత ప్రభుత్వంలో సగటున రూ.1,081.98 రాగా.. ఇప్పుడు వాటి కంటే నాణ్యమైన డ్రెస్సులు రూ.1,061.43కు వచ్చాయంటున్నారు.
ఇలా విద్యార్థికి ఇచ్చే మొత్తం సామగ్రి కలిపితే మొత్తం ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. 1858 ఖర్చు అవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లపేరుతో పంపిణీ చేయనున్నారు.
Leave a Reply