రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ చేసేందుకు వీలుంటుంది.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది. అంటే ఒకసారి బదిలీ చేసిన టికెట్ మరోసారి వేరే వాళ్ల పేరు మీదకు మార్చలేం. బదిలీ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణించేవారు.. తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
ఇదీ టికెట్ బదిలీ ప్రక్రియ..
- కన్ఫర్మ్ అయిన టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలి.
- ఎవరి పేరు మీద టికెట్‌ను మార్చాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దస్త్రం తప్పనిసరిగా ఉండాలి.
- దగ్గర్లోని రైల్వేస్టేషన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి.
- అక్కడ టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అర్జీ సమర్పించాలి. మీ గుర్తింపు కార్డు వివరాలు కూడా సమర్పించాలి.
వీరూ చేయొచ్చు..
భారత రైల్వేశాఖ వివరాల ప్రకారం.. ఆన్‌డ్యూటీ మీద వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు తోటి ఉద్యోగికి టికెట్‌ను బదిలీ చేయొచ్చు. అలాగే, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరుమీద టికెట్ బదిలీ చేయొచ్చు. ఇందుకోసం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందే విద్యా సంస్థ ప్రిన్సిపల్/ హెడ్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఎన్‌సీసీ క్యాడెట్స్ విషయంలో సంబంధిత హెడ్ అర్జీ మేరకు టికెట్‌ను బదిలీ చేస్తారు. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ టికెట్‌ను వెయిటింగ్ లిస్ట్‌లో ప్రాధాన్య క్రమంలో ముందున్నవారికి కేటాయిస్తారు.
Leave a Reply