ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. 2018లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకం ఉండేది. కానీ 2019లో ఈ పథకాన్ని రద్దు చేశారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్‌ను కొంత తగ్గించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారు దాదాపుగా అందరూ పేద విద్యార్థులే ఉంటారని.. వారి కుటంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్నారు మంత్రి. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకం మళ్లీ తీసుకొస్తున్నామన్నారు. స్కూళ్లకు అందిస్తున్న విధంగానే ఇంటర్ చదివే విద్యార్థులకు కూడా ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుందని చెప్పారు.ఇంటర్మీడియట్‌లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని సూచించినట్లు లోకేష్ తెలిపారు.
Leave a Reply