కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) అన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. రేషన్‌కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి మనోహర్‌ సూచించారు. 4.24 కోట్ల మందికి జూన్‌లో ఉచితంగా రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని.. అందులో ఎక్కడా లోపం లేదన్నారు.

ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉంటూ సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకెళ్తోందని చెప్పారు. క్యూఆర్‌ కోడ్‌తో స్మార్ట్‌ రైస్‌కార్డు ఇస్తామని తెలిపారు. దీనికోసం క్షేత్రస్థాయిలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. వయసుతో సంబంధం లేకుండా కుటుంబసభ్యులు ఎవరైనా రేషన్‌కార్డులో యాడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. తొలగింపునకు మాత్రం మరణించిన వారి పేర్లనే ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. కార్డులో ‘హెడ్‌ ఆఫ్‌ ది ఫ్యామిలీ’ మార్చేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నమోదైన తప్పుడు వివరాలను సరిచేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ వరకు వెళ్లకుండా తహసీల్దార్‌ స్థాయిలోనే పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించామని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page