టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీ రేటుకు టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వీటి ధరలు రోజురోజుకూ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.250లు దాటింది. రాష్ట్రంలో కిలో రూ.150 ఉంది. దేశంలో మరెక్కడాలేని విధంగా మార్కెట్ ఇంటెర్వెషన్ స్కీం కింద రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ గత నెల 28 నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది.
ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్ల ద్వారా ఈ అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 422 టన్నుల సేకరణ. ఈ నేపథ్యంలో.. ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చుచేసి 422.06 టన్నులు సేకరించింది. ప్రధాన మార్కెట్లలో వ్యాపారులతో పాటు వేలంపాటల్లో పాల్గొని రైతుల నుంచి, వ్యాపారుల నుంచి సేకరిస్తోంది.
ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.94.44 చొప్పున గరిష్టంగా కిలో రూ.110 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో మనిషికి కిలో నుంచి రెండు కిలోల వరకు విక్రయిస్తోంది.
దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటిన సందర్భంలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు.
Leave a Reply