ఇకపై డిజిటల్‌ రూపంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌

అత్యవసర సమయంలో బండి తీసుకుని హడావిడిగా రోడ్డు మీదకు వస్తాం! రవాణాశాఖ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేసి డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ కార్డు) చూపమంటారు. అవి మన వద్ద లేకపోతే జరిమానా వేస్తుంటారు. ఇది అనేకమందికి అనుభవమైన విషయమే! ఇకపై ఇటువంటి ఇబ్బందులకు అడ్డుకట్ట పడనుంది. ఆధునిక కాలంలో ప్రభుత్వ కార్యాయాల్లోనూ డిజిటలైజేషన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. రవాణాశాఖ సైతం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. వాహనచోదకులకు రవాణాశాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్‌సీలు ఇక కార్డు రూపంలో ఉండవని, యాప్‌ ద్వారా అంతర్జాలంలో డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలు చూపిస్తే చాలని రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులను జారీ చేశారు.

ఛార్జీల వసూలు బంద్‌

రవాణాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్‌ పరివాహన్‌’తో సేవలన్నీ ఆన్‌లైన్‌ చేసింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి డిజిటల్‌ రూపంలోనే పత్రాలను తీసుకొచ్చారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్సీలకు ఏళ్ల తరబడి ప్రింటింగ్‌ కార్డులను రవాణాశాఖ అందిస్తూ వచ్చింది. దరఖాస్తుతోపాటు ఒక్కో కార్డుకు రూ.200, పోస్టల్‌ ఛార్జీలకు రూ.35 కాగా, మొత్తం మీద రూ.235 చలానాతో కలిపి వసూలు చేసేవారు. తపాలాశాఖ ద్వారా నేరుగా ఇంటికే లైసెన్స్‌, ఆర్సీ కార్డులను పంపించేవారు. ఇప్పుడు అటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని, లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు ఉండదని రవాణాశాఖ స్పష్టం చేసింది.

ఉమ్మడి జిల్లాలో 96 వేల కార్డులకు ఫీజులు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల కోసం 28.07.23 వరకు ఫీజులు చెల్లించినవారికి కార్డులు ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులకు సంబంధించి 36 వేల కార్డుల కోసం ఫీజులు వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి రమేష్‌ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఆర్సీ కార్డులకు 45 వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి 15 వేల కార్డులకు ఫీజులు వసూలైనట్లు నంద్యాల జిల్లా రవాణాశాఖ అధికారి జి.వి.శివారెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 96 వేల కార్డులకు ఫీజులు చెల్లించిన వాహనదారులకు అధికారులు త్వరలో వాటిని జారీ చేయనున్నారు. పాత వాటికి సంబంధించి వెబ్‌సైట్‌ https/aprtacitizen.
epragathi.org లో ఫారం-6 గానీ, 23 గానీ డౌన్‌లోడ్‌ చేసుకుని ధ్రువపత్రాన్ని పొందవచ్చు. ప్రస్తుతం కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఎల్‌ఎల్‌ఆర్‌ల కోసం దరఖాస్తు చేయాలన్నా, ప్రింట్‌ తీసుకోవాలన్నాvahan.parivahan.gov.in ద్వారా, ఆర్సీ కార్డు తీసుకోవాలంటే vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్‌ చరవాణిలో APRTA Citizen యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పత్రాలను mParivahan/Digi లాకర్‌ యాప్‌లో అందుబాటులో ఉంచడంతో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. తనిఖీల సమయంలో వాహనచోదకులు చరవాణిలో ఉంచిన పత్రాలను చూపిస్తే చాలని పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కార్డుల పంపిణీ ఉండదు

ఇక నుంచి రవాణాశాఖ జారీ చేసే ఆర్సీలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు సంబంధించి కార్డులు ఇవ్వం. 28.07.23 వరకు ఫీజులు వసూలు చేసిన వాటికి సంబంధించి వాహనదారులకు త్వరలో అందిస్తాం. ఇకపై కార్డుల కోసం ఫీజుల వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు mParivahan/Digi లాకర్‌ విధానంలో చరవాణిలో అందుబాటులో ఉంచుకుంటే చాలు! డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన చోదకులు రవాణాశాఖ యాప్‌ నుంచి పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని చూపిస్తే సరిపోతుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page