జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు

రాష్ట్రంలో పాడి రైతుల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి మరింత మేలు చేకూర్చనున్నారు.

జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించి, వారి వ్యాపారానికి అవసరమైన రుణాలను మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత మహిళా లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు చేయిస్తున్నారు. వీరి నుంచి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులు వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్డుల ద్వారా లబ్ధిదారులకు అవసరమైన వర్కింగ్ కేపిటల్ కోసం రుణాలు మంజూరు చేయించనుంది. ఇందుకోసం జిల్లాలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది.

ఇటీవల జరిగిన బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో 18 జిల్లాల్లోని 2.28 లక్షల మంది జగనన్న పాల వెల్లువ లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వీరందరికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, రుణాలు మంజూరు చేయాలని ఆ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా పశు, మత్స్యకార రైతులకు ప్రత్యేకంగా కార్డులు ఇచ్చి, వారికి అవసరమైన రుణాలు మంజూరు చేస్తారు.

అర్హులైన వారందరికి ఈ కార్డులు ఇవ్వడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పశు, మత్స్యకార రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం జిల్లాలవారీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఈ కార్డులపై వర్కింగ్ క్యాపిటల్గా లబ్దిదారులకు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఈ రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారు వార్షిక వడ్డీలో 3 శాతం సత్వర రీపేమెంట్ ప్రోత్సాహకానికి అర్హులవుతారు.

ప్రతి శుక్రవారం శిబిరాలు

ఈ కార్డులతో పాటు రుణాల మంజూరుకు ప్రతి శుక్రవారం బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాయి. అక్కడికక్కడే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వెంటనే ప్రాసెస్ చేస్తాయి.

సూత్రప్రాయ మంజూరు కూడా ఈ శిబిరాల్లోనే చేస్తారు. వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారులు ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారని, అలాగే ఇప్పటికే జగనన్న పాల వెల్లువ కింద పాడి పశువులను కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో వీరికి క్రెడిట్ కార్డులు, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసింది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page